మెల్బోర్న్: టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పలు పెట్టే జోకోవిచ్‌కు ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. పదవ సారి ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ గెలవాలనుకుంటున్న సెర్బియా స్టార్‌తో .. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ శాఖ ఆటాడుకుంటోంది. టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడు జోకోవిచ్‌కు ఆస్ట్రేలియా మరోసారి జలక్ ఇచ్చింది. రెండో సారి జోకో వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి అలెక్స్ హాకే తన స్వంత అధికారాలను వినియోగించి జోకో వీసాను రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. జోకోవిచ్ లాయర్లు ఇంజెక్షన్ కోసం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు.
వాస్తవానికి ఇప్పటికే ఆస్ట్రేలియా జోకో వీసాను రద్దు చేసింది. అయితే కోర్టులో కేసు వేసిన జోకోవిచ్‌కు తొలిసారి ఊరట లభించింది. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ శాఖ తీసుకున్న నిర్ణయం జోకోను మళ్లీ కష్టాల్లోకి నెట్టింది. అయితే సోమవారం నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో జోకోకు చోటు కల్పించారు. ఆ దేశానికి చెందిన మరో ప్లేయర్‌తోనే జోకో తొలి రౌండ్లో ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ శాఖ ఆదేశాలతో.. జోకోవిచ్ తక్షణమే ఆస్ట్రేలియా వదిలి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకుండా ఆస్ట్రేలియాలోకి ఎంటర్ అయిన జోకోకు ఎలా మినహాయింపు ఇస్తారని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జోకో పరిస్థితి అయోమయంగా మారింది.