ICC Test-ODI Rankings | టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అదరగొడుతున్నాడు. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన ఈ వికెట్ కీపర్ ఆరో స్థానానికి చేరుకున్నారు. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. డిసెంబర్ 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చాడు. తనదైన బ్యాటింగ్‌తో అందరినీ అలరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 731 పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరాడు. అదే సమయంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం మెరుగుపరుచుకొని 751 పాయింట్లతో టాప్-5కి ఎగబాకాడు. నెంబర్ వన్ ప్లేస్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్, రెండోస్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, 3వ స్థానంలో డారెల్ మిచేల్, 4వ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ కొనసాగుతున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా పది, 11వ ప్లేస్‌కి పడిపోయాడు. శుభ్‌మన్ గిల్ ఐదుర్యాంకులు మెరుగుపరుచుకుని 14వ ప్లేస్‌కి చేరాడు. ఇక టెస్టు నెంబర్ వన్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా రెండోస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ థర్డ్ ప్లేస్‌లో ఉండగా.. కమ్మిన్సన్ 4వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒకస్థానం మెరుగుపరుచుకొని 6వ ప్లేస్‌కి చేరాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌తో పాటు వన్డే ర్యాంకింగ్స్‌ను సైతం ఐసీసీ విడుదల చేసింది. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ అద్భుత ప్రదర్శనతో తొలిసారిగా టాప్-10లో చేరిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై సెంచరీ చేశాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బ్యాటర్‌గా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ నిలువగా.. రెండోస్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా మూడు, నాలుగు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. టాప్-5లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండడం విశేషం.