ICC : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా స్పిన్ అస్త్రంగా అదరగొడుతున్న నొన్కులలెన్కో మ్లాబా (Nonkululeko Mlaba)కు షాక్ తగిలింది. మెగా టోర్నీలో వికెట్ల వేటతో చెలరేగుతున్న ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆగ్రహానికి గురైంది. భారత జట్టుతో మ్యాచ్ సమయంలో ఐసీసీ నియమావళి ఉల్లంఘించినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది. విశాఖపట్టణంలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో మ్లాబా రెచ్చగొట్టేలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
వరల్డ్ కప్‌లో రెండు విజయాలతో జోరుమీదున్న భారత జట్టు శుక్రవారం వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడింది. ఆ మ్యాచ్‌లో మ్లాబా 17వ ఓవర్లో డేంజరస్ హర్లీన్ డియోల్ (Harleen Deol)ను బౌల్డ్ చేసింది. వికెట్ తీసిన సంబురంలో ఆమె డియోల్ వైపు చూస్తూ.. బై బై అంటూ వీడ్కోలు పలికింది. ఆమె తన కుడిచేతిని భారత బ్యాటర్ వైపు చూపిస్తూ ఇక వెళ్లు అన్నట్టుగా సంజ్ఞ చేసింది. అయితే.. ఈ విషయాన్ని రిఫరీ టర్డీ అండర్సన్ మ్యాచ్ అనంతరం క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది.
Nonkululeko Mlaba strikes again! 🇿🇦⚡
She cleans up Harleen Deol for a struggling knock of 13(23) in Vizag! ❌👀
🇮🇳 – 83/2 (17)#HarleenDeol #INDWvSAW #CWC25 #Sportskeeda pic.twitter.com/qcnfuid0RI
— Sportskeeda (@Sportskeeda) October 9, 2025
అంపైర్లు జాక్వెలిన్ విలియమ్స్, కిమ్ కాటన్, క్యాండసే లె బొర్డే, సూ రెడ్ఫెర్న్లు కూడా ఆర్టికిల్ 2.5 ఐసీసీ కోడ్‌ను మ్లాబా అతిక్రమించిందని ఐసీసీకి తెలిపారు. ఈ ఘటనపై మ్లాబాను విచారించగా.. ఆమె తన తప్పిదాన్ని అంగీకరించింది. మ్యాచ్ మధ్యలో రెచ్చగొట్టేలా సంజ్ఞలు చేసినందుకు ఐసీసీ ఆమె తీరును తప్పుపడుతూ ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ఈ రెండేళ్లలో మరోసారి తను ఇలాంటి పొరపాటు చేస్తే మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశముంది.
తొలి కప్ వేటలో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి ఓవర్ వరకూ విజయం ఇరుజట్లతో దోబూచులాడగా.. మూడు వికెట్ల తేడాతో గెలిచింది సఫారీ టీమ్. టీమిండియా నిర్దేశించిన 252 పరుగుల ఛేదనలో ఏడు వికెట్లు పడినా డెత్ ఓవర్లలో డీక్లెర్క్ (84 నాటౌట్: 54 బంతుల్లో 8ఫోర్లు, 5 సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగింది. సంచలన బ్యాటింగ్‌తో సఫారీలకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.