మకావు: హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నేపల్లి మకావు ఓపెన్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఈ టోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తున్న 23 ఏండ్ల తరుణ్.. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో 21-12, 13-21, 21-18తో చైనాకు చెందిన హు ఝెను ఓడించి సెమీస్ చేరాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో సెమీస్ చేరడం ఈ హైదరాబాదీకి ఇదే తొలిసారి. తొలి గేమ్‌లో 4-7తో వెనుకబడ్డ అతడు.. ఆరు పాయింట్లు సాధించి 15-11తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి ఆ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో తడబాటుకు గురైనా నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆరంభం నుంచే ఆధికాన్ని ప్రదర్శిస్తూ 5-0తో నిలిచాడు.
19-15తో గేమ్‌పై పూర్తి పట్టు సాధించిన అతడు దానినే కొనసాగిస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుని లాస్ట్-4కు అర్హత సాధించాడు. మరో సింగిల్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్.. 21-14, 18-21, 21-14తో జువాన్ చెన్ ఝు ని చిత్తు చేశాడు. ఈ ఏడాది లక్ష్యకు ఇదే తొలి సెమీస్ కావడం గమనార్హం. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ ద్వయం పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో భారత జోడీకి 14-21, 21-13, 20-22తో చూంగ్ హాన్ జియాన్, హైకల్ మహ్మద్ (మలేషియా) చేతిలో చుక్కెదురైంది.