హైదరాబాద్, ఆట ప్రతినిధి: చిన్ననాటి విషాధాలను, పేదరికాన్నీ జయించి సెయిలింగ్‌లో అద్భుత ప్రతిభను కనబరిచిన ముగ్గురు తెలుగు కుర్రాళ్లు నవీన్, సాత్విక్, రిజ్వాన్ భారత నౌకాదళంలో చేరనున్నారు. ఈ ముగ్గురూ గోవాలోని నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ (ఎంవైఎస్పీ)కి ఎంపికయ్యారు. ఈ ముగ్గురి విజయగాథ ఇది.. 14 ఏండ్ల సాత్విక్‌ది వరంగల్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామం. అతడి చిన్న వయసులోనే సాత్విక్ కుటుంబం హైదరాబాద్‌కు వలసవచ్చింది. అతడి తండ్రి మోండా మార్కెట్లో కూలీగా పనిచేస్తుండగా తల్లి.. ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 15 ఏండ్ల రిజ్వాన్.. హైదరాబాద్‌లోని పాటిగడ్డ ప్రాంతానికి చెందినవాడు. ఏడేండ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయినా.. అతడి తల్లి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో వంటమనిషిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నది.
ఇక 13 ఏండ్ల నవీన్.. ప్రకాశం జిల్లాలోని లక్ష్మప్ప గ్రామవాసి. ఆరేండ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన నవీన్.. చిన్నప్పుడే తప్పిపోయి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు దొరికాడు. వారు అతడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా తారా హోమ్ అనే అనాథ శరణాలయంలో చేర్పించారు. ఈ ముగ్గురి ప్రతిభను గుర్తించిన యాచ్.. వారికి ప్రత్యేక శిక్షణనిప్పించింది. కోచ్ సుహీమ్ షేక్ పర్యవేక్షణలో ఈ అబ్బాయిలు.. సెయిలింగ్‌లో కఠోర శిక్షణ పొందారు. వారి అంకితభావం, పట్టుదల జాతీయ స్థాయి పోటీలలో పతకాలతో ఉన్నతస్థానంలో నిలబెట్టాయి. ఈ క్రమంలోనే వీరి అసాధారణ ప్రతిభను గుర్తించిన నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ.. వారిని తమ జట్టులోకి ఎంపిక చేసుకుంది. నవీన్, సాత్విక్, రిజ్వాన్ ఎంవైఎస్సీకి ఎంపికవడంపై కోచ్ సుహీమ్ స్పందిస్తూ.. ‘ఆ ముగ్గురూ హైదరాబాద్ సెయిలింగ్‌కు అమర్ అక్బర్ ఆంథోనీ లాంటివారు’ అని కొనియాడారు.