హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఫోర్జరీ కేసులో మరో కీలక మలుపు. కేసు నమోదనప్పటీ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఏ-2, హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ రామచందర్‌ను సీఐడీ పోలీసులు శుక్రవారం పుణెలో అరెస్ట్ చేశారు. స్థానికంగా ఓ త్రీ స్టార్ హోటల్లో బస చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు దేవరాజ్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 36 గంటల పాటు నిర్విరామంగా పనిచేసిన పోలీసు బృందాలు ఎట్టకేలకు సఫలీకృతమయ్యాయి. మల్కాజ్గిరి కోర్టులో దేవరాజ్‌ను సీఐడీ హాజరుపరిచింది. ఈ కేసు నమోదైన 9వ తేదీ నుంచి ఏ-2గా ఉన్న దేవరాజ్.. పోలీసులను ఏమారుస్తూ తప్పించుకున్నాడు. సస్పెన్షన్‌కు గురైన ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డి సమాచారంతో పోలీసుల కండ్లుగప్పి తిరిగాడు. ఈ 17 రోజుల వ్యవధిలో ఏడు రాష్ర్టాలు తిరిగినట్లు తెలిసింది.
తొలుత హైదరాబాద్ నుంచి భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా, పుణె, ఊటీ, యానాం నగరాల్లో దేవరాజ్ బసచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దేవరాజ్‌ను తమ అదుపులోకి తీసుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు..వేర్వేరు రాష్ర్టాల పోలీసుల సమన్వయంతో ముందుకు సాగాయి. ఇదిలా ఉంటే ఫోర్జరీ కేసులో ఏ-1గా ఉన్న అధ్యక్షుడు జగన్మోహన్రావును కస్టడీ కొనసాగించాలన్న సీఐడీ వేసిన పిటిషన్‌ను మల్కాజిగిరి కోర్టు కొట్టేసింది. సోమవారం పిటిషన్‌ను వాదనలు జరుగనున్నాయి. మరోవైపు ఇదే కేసులో హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి రాజేందర్యాదవ్కు బెయిల్ మంజూరు అయ్యింది.