Chahal vs Bishnoi: టీమిండియా సీనియర్ స్పిన్నర్, టీ20లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన యుజ్వేంద్ర చాహల్‌కు ఈ ఫార్మాట్లో ఆడే అవకాశం ఇక కష్టమేనా..? పొట్టి క్రికెట్లో అతడికి తలుపులు మూసుకుపోయాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. రవి బిష్ణోయ్‌కు వరుసగా అవకాశాలు ఇస్తుండటంతో ఇక చాహల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఐసీసీ ట్రోఫీలలో ఆడే అవకాశాన్ని దక్కించుకోకపోవడంలో చాహల్ తర్వాతే ఎవరైనా.. దానికి గత రెండేండ్లు జరిగిన టీ20 ప్రపంచకప్‌లే నిదర్శనం. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న పొట్టి ప్రపంచకప్‌లో కూడా చాహల్ ఆడేది అనుమానమే.
2021 టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన చాహల్.. ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రం భాగమయ్యాడు. పరిమిత ఓవర్లలో మాత్రమే ఆడే చాహల్‌కు కనీసం 2022లో అయినా ఆడే అవకాశం దక్కుతుందని ఆశించినా జట్టులో అతడిని ఎంపిక చేసినా తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో కూడా చాహల్‌కు పదిహేను మంది సభ్యులలో చోటు దక్కలేదు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్వదేశంలో ఆడిన ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు త్వరలో దక్షిణాఫ్రికా వేదికగా జరగాల్సి ఉన్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా సెలక్టర్లు చాహల్‌ను పట్టించుకోలేదు. మరోవైపు ఆసీస్‌తో సిరీస్‌లో రవి బిష్ణోయ్ అంచనాలకు మించి రాణించాడు. ఐదు మ్యాచ్‌లలో అతడు తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు. అదీగాక దక్షిణాఫ్రికాతో సిరీస్ కు కూడా ఎంపికయ్యాడు.
HUGE wicket!
Ravi Bishnoi gets Travis Head out with a ripper 😎#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/AQ4alP6JHk
— BCCI (@BCCI) December 3, 2023
టార్గెట్ వరల్డ్ కప్..
చాహల్‌ను పక్కనబెట్టి బిష్ణోయ్‌కు వరుసగా అవకాశాలు ఇస్తుండటం కూడా సీనియర్ స్పిన్నర్‌ను ప్రపంచకప్‌కు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అనిపిస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్‌లతో పాటు బిష్ణోయ్ కూడా అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుంటున్నాడు. మిడిల్ ఓవర్స్‌లో అతడు బౌలింగ్ చేసే విధానం ఆకట్టుకుంటున్నది. బిష్ణోయ్ విసిరిన గూగ్లీలకు ప్రత్యర్థుల వద్ద సమాధానం లేకుండా పోతున్నది. వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా జట్టును సానబెడుతున్న సెలక్టర్లు బిష్ణోయ్‌ను మెగా టోర్నీ వరకు పూర్తిగా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిశాక జనవరిలో భారత్.. అఫ్గాన్‌తో సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్‌లో కూడా దాదాపు ఇదే యువ జట్టు బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. ఆ తర్వాత భారత్ ఆటగాళ్లు ఐపీఎల్ లో తప్ప అంతర్జాతీయ స్థాయిలో టీ20లు ఆడరు. ఈ లెక్కన చూస్తే ఐపీఎల్లో చాహల్ మెరుగైన ప్రదర్శనలు చేసినా అతడిని ఎంపిక చేస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
బిష్ణోయ్ వర్సెస్ చాహల్..
ఈ ఏడాది బిష్ణోయ్ 11 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీయగా చాహల్ 9 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా చూస్తే చాహల్.. 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు తీయగా బిష్ణోయ్ 21 మ్యాచ్‌లలో 34 వికెట్లు పడగొట్టాడు. చాహల్ యావరేజ్ 25.09గా ఉండగా రవి 17.38తో ఉన్నాడు. ఎకానమీని పరిగణనలోకి తీసుకున్నా చాహల్ ఎకానమీ 8.19గా ఉండగా బిష్ణోయ్.. 7.14తోనే అతడి కంటే మెరుగ్గా ఉన్నాడు. అయితే బిష్ణోయ్.. త్వరలో సౌతాఫ్రికాతో జరుగబోయే సిరీస్‌లో ఎలా రాణిస్తాడు..? అన్నది కీలకంగా మారింది. అతడు ఇంతవరకూ స్వదేశంలో రాణించినా విదేశాల్లో ఆడింది చాలా తక్కువ. సఫారీ టీమ్‌పై బిష్ణోయ్ రాణిస్తే అతడు ప్రపంచకప్ టీమ్‌లో బెర్త్ ఖాయం చేసుకున్నట్టే…!