Hardhik – Natasha :భారత టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా- నటాషా పెళ్లి ఫొటోలు గత వారం రోజులుగా ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఈమధ్యే హార్దిక్ తన భార్య నటాషాను రెండోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. క్రైస్తవ, హిందూ సంప్రాదాయ ప్రకారం నటాషాను మళ్లీ వివాహం చేసుకున్న అతను సోషల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేశాడు. తాజాగా హల్దీ, మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలను హార్దిక్ ఇన్‌స్టాలో పెట్టాడు. ఆ ఫొటోలకు ‘ప్రేమ రంగులు పులుముకున్నాం’ అని హార్ధిక్ క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం వీళ్లిద్దరి ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
హార్దిక్ – నటాషాలకు ఇంతకుముందే పెళ్లి అయింది. అగస్త్య అనే ఏడాదిన్నర పిల్లాడు ఉన్నాడు. అయినా కూడా ఈ జంట రెండోసారి వివాహం చేసుకోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..? 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషా పెళ్లి జరిగింది. అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. అయితే… పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషా నిర్ణయించుకున్నారు. అందుకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా కన్నులపండువగా వీళ్లు రెండోసారి వివాహం చేసుకున్నారు. తమ కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకున్నారు.
న్యూజిలాండ్ సిరీస్ తర్వాత విరామంలో ఉన్న హార్దిక్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ మొదటి వన్డేకు అందుబాటులో లేకపోవడంతో పాండ్యా జట్టును నడిపించనున్నాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ముంబై (మార్చి 17), వైజాగ్ (మార్చి 19), చెన్నై(మార్చి 22) వేదికగా మూడు వన్డేలు ఆడనున్నాయి.