షార్జా: అంతర్జాతీయ క్రికెట్లో తాము ఎంత మాత్రం పసికూనలం కాదని అఫ్గానిస్థాన్ జట్టు నిరూపించింది. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన రెండో వన్డేలో అఫ్గన్ 177 పరుగులతో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం సాధించింది. తద్వారా సఫారీలపై తొలి వన్డే సిరీస్‌ను దక్కించుకుని తమ సత్తాఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. తొలుత రహ్మనుల్లా గుర్బాజ్ (105) సూపర్ సెంచరీకి తోడు అజ్మతుల్లా ఒమర్జాయ్(86 నాటౌట్), రెహమత్ షా(50) అర్ధసెంచరీలతో అఫ్గన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 311/4 భారీ స్కోరు చేసింది.
88 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన అఫ్గన్‌ను ఒమర్జాయ్, రెహమత్షా ఆదుకున్నారు. వీరిద్దరు సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఒమర్జాయ్ తన ఇన్నింగ్స్‌లో 10ఫోర్లు, మూడు భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. గుర్బాజ్ తర్వాత క్రీజులోకొచ్చిన అజ్మతుల్లా దూకుడు కనబరిచాడు. 5ఫోర్లు, 6సిక్స్‌లతో సఫారీలపై విరుచుకుపడటంతో స్కోరు 300 మార్క్ అందుకుంది.
ఎంగ్డీ, బర్గర్, పీటర్, మార్క్మ్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 34.2 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్(5/19) ధాటికి సఫారీ బ్యాటర్లు చాపచుట్టేశారు. ఓవైపు గాయం వేధిస్తున్నా..రషీద్ తన స్పిన్ నైపుణ్యంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. కెప్టెన్ బవుమా(38) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రషీద్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.