Rahul Dravid : ‘గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా’(Great Wall Of China) పేరు వినగానే పెద్ద రక్షణ గోడ గుర్తుకొస్తుంది. గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా లానే మనకూ క్రికెట్లో ఓ గ్రేట్ వాల్ ఉండేది. ప్రత్యర్థి బౌలర్ల నుంచి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే ఆ వాల్ పని. ఆ వాల్ పేరు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid). టీమిండియా చిరస్మరణీయ విజయాల్లో భాగమైన ద్రవిడ్ బ్యాటింగ్ టెక్నిక్ నిజంగా అంతుపట్టని రహస్యం. ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్(Team India Head Coach)గా ఉన్న అతడి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మైదానంలో, బయట ప్రశాంతంగా కనిపించే ద్రవిడ్ జీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. క్రికెటర్‌గానే కాదు, మంచి వ్యక్తి త్వంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఒకప్పటి వాల్ విశేషాలివి..
ద్రవిడ్ అద్భుతమైన బ్యాటర్ (Wicketkeeper Batter) మాత్రమే కాదు. గొప్ప వికెట్ కీపర్ కూడా. 2003-04 సీజన్లో నయన్ మోంగియా(Nayan Mongia) గాయపడినప్పుడు, 2004లో ఫామ్ లేమి కారణంగా అతను జట్టుకు దూరమైనప్పుడు ద్రవిడ్ రెండేళ్ల పాటు కీపింగ్ చేశాడు. 2001లో జరిగిన కోల్‌కతా టెస్టులో ద్రవిడ్ ఆటను క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోరు. గాయం, జ్వరంతో బాధపడుతున్నా కూడా కెప్టెన్ గంగూలీ అభ్యర్థనతో అతను కీపింగ్ చేశాడు. అద్భుత క్యాచ్‌తో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా (Steve Waugh)ను పెవిలియన్ పంపిన తీరు అత్యద్భుతం. ఆ తర్వాత ధోనీ సారథ్యంలో ద్రవిడ్ ఫీల్డింగ్ స్థానం స్లిప్స్‌లోకి మారింది. మరో విషయం ఏంటంటే..? నాన్ వికెట్ కీపర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డు ద్రవిడ్ పేరున ఉంది.
క్రీజులో బౌలర్ల ఓపికకు పరీక్ష పెట్టే ద్రవిడ్ ఒక జంతు ప్రేమికుడు అనే విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అతడికి వన్యప్రాణులు (Wildlife Enthusiast) అంటే ఎంతో ఇష్టం. అందుకని వాటి సంరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. ప్రజల్లో అడవి జంతువుల పట్ల అవగాహన కల్పించేందుకు తరచూ ప్రచారం కూడా చేస్తుంటాడు.
దత్తత తీసుకున్న చిరుతలతో ద్రవిడ్
అంతేకాదు ద్రవిడ్ రెండు చిరుత పులులను దత్తత తీసుకున్నాడు. వాటికి తన కుమారుల పేర్లు పెట్టాడు. అతడికి వన్యప్రాణులపై ఉన్న ప్రేమ, వాటిని రక్షించాలన్న తపన ఎంతోమంది ప్రశంసలు అందుకునేలా చేసింది.
ఒకప్పుడు భారత మిడిలార్డర్(Middle Order)కు వెన్నెముక అయిన ద్రవిడ్ ఓసారి కుటుంబంతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో అతను స్కూప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్ వంటి అసాధ్యమైన షాట్లను కొడుతున్నట్టు ఊహించుకొని గాల్లోనే చేతులు ఊపసాగాడు. ద్రవిడ్ అలా ప్రవర్తించడం చూసి కుటుంబ సభ్యులు మనసారా నవ్వుకున్నారు. అతనలా చేతులు గాల్లో ఊపడాన్ని వాళ్లు క్రికెట్ నాట్యంగా అభివర్ణించారు. నిజానికి అదే ఆ తర్వాత ద్రవిడ్‌కు క్రికెట్‌పై ధ్యాసను మరింత పెంచింది. కుటుంబంతో ఉన్నా కూడా అతడి ఆలోచనలన్నీ క్రికెట్ గురించే ఉంటాయని చెప్పడానికి ఈ సంఘటన ఓ నిదర్శనం.
ద్రవిడ్‌లో కనిపించే అతి ముఖ్యమైన లక్షణం వినయం. క్రికెటర్‌గా మారడానికి ముందు ద్రవిడ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో ట్రైనీగా పనిచేశాడు. అప్పట్లో అతడు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడని ఎవరూ ఊహించలేదు. క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఇటు చదువును, అటు క్రికెట్‌ను బ్యాలెన్స్ చేయాలని అనుకున్నాడు. అయితే, చదువులో అతడు మెరిక కావడంతో క్రికెట్ ఆడేందుకు ఎక్కవ సమయం లభించేది. అన్ని సబ్జెక్టుల్లోనూ 90కిపైగా మార్కులు స్కోరు చేసేవాడు. దేశవాళీ క్రికెట్లో రాణించి, జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి సంచనాలు నమోదు చేశాడు.
ద్రవిడ్ మంచి మంచి చదువరి కూడా. బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నాడు. నిజానికి ద్రవిడ్ చదువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. కామర్స్‌లోనూ డిగ్రీ పూర్తిచేశాడు. కర్ణాటకకే చెందిన దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే(Anil Kumble)లానే అటు అకడమిక్, ఇటు స్పోర్ట్స్‌లో రాణించి ద్రవిడ్ ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు.
ద్రవిడ్, గంగూలీ
ద్రవిడ్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే..? అతనొక పుస్తకాల పురుగు. పుస్తకం కనిపిస్తే చదివేంత వరకు అస్సలు విడిచిపెట్టడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడడం కంటే పుస్తకాల్లో లీనం కావడమే (Avid Reader) అతడికి ఎక్కువ ఇష్టం. చదువు వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని, గొప్ప గొప్ప పదాలను నేర్చుకోవచ్చని చెబుతాడు. అంతేకాదు, పుస్తక పఠనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని ద్రవిడ్ నమ్ముతాడు. ఈ అలవాటే అతడిని క్రికెట్లో సానుకూల దృక్పథం అలవర్చుకునేలా చేశాయి. తన ఆలోచనా పరిధిని విస్తరించేందుకు పుస్తకాలు బాగా పనికొచ్చాయని ద్రవిడ్ పలుమార్లు చెప్పుకొచ్చాడు.
అసమాన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ద్రవిడ్ అరుదైన రికార్డులు నెలకొల్పాడు. అన్ని టెస్టు దేశాలపైనా సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సైతం ఈ ఘనత సాధించలేకపోయాడు. ఈ ఫీట్‌తో ద్రవిడ్ ఎలైట్ క్లబ్‌లోకి ప్రవేశించాడు. ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక క్రికెటర్‌గానూ ఘనత సాధించాడు.
ఆటగాడిగా మైదానంలో రికార్డులు కొల్లగొట్టిన రాహుల్ ద్రవిడ్ కోచ్‌గానూ సక్సెస్ అయ్యాడు. కోచ్‌గా భారత అండర్-19 జట్టును అద్బుతంగ తీర్చి దిద్దడమే కాకుండా ప్రపంచ చాంపియన్ చేశాడు. 2016 అండర్-19 ప్రపంచకప్‌లో జట్టును రన్నరప్‌గా నిలిపాడు. 2018లో వరల్డ్ కప్ అందించిపెట్టాడు.
అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీతో ద్రవిడ్ బృందం
యువ ఆటగాళ్లలోని టాలెంట్‌ను గుర్తించి వెలికి తీయడంలో ద్రవిడ్‌ది అందెవేసిన చేయి. పృథ్వీషా(Prithvi Shaw), శుభమన్ గిల్(Shubman Gill), రిషభ్ పంత్(Rishabh Pant).. వీళ్లంతా భారత జట్టులో చోటు సంపాదించి కీలక ప్లేయర్లుగా మారడం వెనక ఉన్నది ద్రవిడే.
ద్రవిడ్ ఉక్కు సంకల్పం(Iron Will) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఓసారి టెస్టు మ్యాచ్‌ను డ్రా చేయడం కోసం తీవ్ర జ్వరంతో బాధపడుతూనే 12 గంటలు బ్యాటింగ్ చేశాడు. 2001 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో కోల్‌కతాలోని విపరీతమైన వేడి కారణంగా జ్వరం బారినపడ్డాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. ఆస్ట్రేలియా గెలుపు ఖాయమని అందరూ డిసైడైపోయారు.
వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్
ఫాలో ఆన్ ఆడుతున్న భారత్‌ను వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి ద్రవిడ్ ఆదుకున్న తీరు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఓ వైపు ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగును ఎదుర్కుంటూ, మరోవైపు జ్వరంతో బాధపడుతూ రెండు రోజులపాటు బ్యాటింగ్ చేసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్ 180 పరుగులు చేశాడు.
అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ద్రవిడ్ కష్టాల్లో ఉన్నవాళ్లను చూస్తే తట్టుకోలేడు. వాళ్లకు చేతనైనంత సాయం చేస్తాడు. అంతేకాదు ద్రవిడ్ తరచూ పిల్లల సంక్షేమ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాడు. చిన్నారులకు విద్య, వైద్యం వంటివి అందించేందుకు తన పేరుతో ‘రాహుల్ ద్రవిడ్ ఫౌండేషన్’ (Rahul Dravid Foundation) నెలకొల్పాడు. ఇక్కడ పేద పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణతోపాటు జీవిత నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. క్రీడల్లో నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి, వారికి సాయం అందిస్తారు.