హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడల్లో గురుకుల విద్యార్థులు అదరగొడుతున్నారు. టోర్నీ ఏదైనా…అద్భుత ప్రదర్శనతో పతకాలు కొల్లగొడుతున్నారు. బౌల్డర్హిల్స్, కంట్రీ క్లబ్ వేదికగా జరిగిన ప్రపంచ అమెచ్యూర్ గోల్ఫ్ ర్యాంకింగ్ ఈవెంట్లో ఎస్సీ గురుకుల విద్యార్థి అమూల్య..‘అప్కమింగ్ ప్లేయర్ అవార్డు’ దక్కించుకుంది. తొర్రూరులో విద్యనభ్యసిస్తున్న అమూల్య..మెరుగైన ప్రదర్శనతో ప్రొఫెషనల్ గోల్ఫర్లకు దీటైన పోటీనిచ్చింది. మొత్తం మూడు మెయిన్ రౌండ్లలో 257 సగటుతో 87,86, 84 స్కోరు నమోదు చేసింది. ఎస్సీ గురుకుల గోల్ఫ్ అకాడమీకి చెందిన ఐదుగురు గోల్ఫర్లు ఈ టోర్నీలో అమెచ్యూర్ ప్లేయర్లతో తలపడి ప్రతిభ చాటుకున్నారు. టోర్నీలో అంచనాలకు మించి రాణించిన గురుకుల గోల్ఫర్లకు నిర్వాహకులు ఢిల్లీలో జరిగే టోర్నీలో ఆడే అవకాశం కల్పించారు.