మెల్బోర్న్: ఫోర్లు, సిక్సర్లతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెలరేగాడు. బిగ్ బ్యాష్ లీగ్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. మెల్బోర్న్ స్టార్స్ తరపున ఆడుతున్న మ్యాక్స్‌వెల్.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హురికేన్స్ బౌలర్లను చితకబాదాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ హిట్టర్ కేవలం 64 బంతుల్లో 154 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. బీబీఎల్‌లో వ్యక్తిగతంగా ఇదే అత్యధిక స్కోర్. మూడవ వికెట్‌కు మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ అజేయంగా 132 రన్స్ జోడించారు. దీంతో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 273 రన్స్ చేశారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే రెండవ అత్యధిక స్కోర్ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో స్టోయినిస్ 31 బంతుల్లో 75 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో 154 రన్స్ చేయగా.. గతంలో బీబీఎల్‌లో టీమ్మేట్ స్టోయినిస్ అత్యధికంగా 147 రన్స్ చేశాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్, స్టోయినిస్‌లు ఇద్దరు కలిసి ఏకంగా 26 బౌండరీలు, 10 సిక్సర్లతో హోరెత్తించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్డ్ హురికేన్స్ కేవలం 167 రన్స్ మాత్రమే చేశారు.