నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ముల్లాన్‌పూర్ టెస్టుకు ముందు భారత తుది జట్టు ఎంపికపై విమర్శలు వచ్చాయి. ఇది టీమిండియానా లేక ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేశారు. కెప్టెన్ గిల్‌తో పాటు సుదర్శన్, సుందర్, ప్రసిధ్, సిరాజ్, మానవ్ సుతార్ రూపంలో ఏకంగా ఆరుగురు జీటీ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కడంతో తీవ్రమైన ట్రోల్స్ నడిచాయి. కానీ, మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో విమర్శలు వచ్చిన ఈ ఆటగాళ్లే అద్భుతంగా రాణించి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. అందునా అరంగేట్రం ఆటగాడు మానవ్ సుతార్ తన ఎంపికకు 100 శాతం న్యాయం చేస్తూ, పదునైన బౌలింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు.
ప్రతిభకు కఠిన శ్రమ, పట్టుదల తోడైతే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపించాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక సాధారణ నెట్ బౌలర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించిన 23 ఏండ్ల ఈ కుర్రాడు ఇప్పుడు భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసి..తొలి మ్యాచ్‌లోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. బ్యాట్‌తోనూ విలువైన పరుగులు చేసిన అతని ప్రదర్శన.. భారత క్రికెట్ వర్గాలకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ ఆశిష్ కపూర్, హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు మాత్రం ఇది ఊహించిన విజయమే.
లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఎదుగుదల వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ అరంగేట్రం చేసిన 2022 సీజన్ సమయంలో కోవిడ్ నిబంధనల వల్ల జట్లు బయో బబుల్‌లో ఉండేవి. ఆ సమయంలో టైటాన్స్‌కు నెట్ బౌలర్ల అవసరం ఏర్పడింది.తొలుత రాజస్థాన్‌కే చెందిన మరో బౌలర్ శుభం శర్మను ఎంపిక చేయాలని అనుకున్నా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఆశిష్ కపూర్ సూచనతో సుతార్‌కు అవకాశం దక్కింది. ‘మొదటి రెండు రోజులు అతడు నెట్స్‌లో బౌలింగ్ చేసిన విధానం చూసి జట్టులోని ప్రతి ఒక్కరూ అభిమానులుగా మారిపోయారు. అప్పటి నుంచి దాదాపు రెండేండ్ల పాటు నెట్ బౌలర్‌గా ఉన్న అతడిని, ఆ తర్వాతే జట్టులోకి తీసుకున్నాం’ అని ఆశిష్ కపూర్ గుర్తు చేసుకున్నాడు. పిచ్ సహకరించకపోయినా బంతిని అద్భుతంగా టర్న్ చేయగల సామర్థ్యం సుతార్ సొంతం. దేశవాళీ క్రికెట్లోనూ అతనికి మంచి రికార్డు ఉంది.
భారత టెస్ట్ జట్టులో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయగల సత్తా సుతార్‌కు ఉందని కోచింగ్ సిబ్బంది ఏడాది కాలంగా చర్చిస్తున్నారు. ముల్లాన్‌పూర్ టెస్ట్ ద్వారా ఆ నమ్మకం నిజమైంది. 2011లో అశ్విన్ తర్వాత అరంగేట్రంలోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన భారత రెండో స్పిన్నర్‌గా సుతార్ నిలిచాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలం రాణించాలంటే సుతార్ తన ‘గేమ్ స్మార్ట్‌నెస్’ను మెరుగుపరుచుకోవాలని, ఫ్లాట్ పిచ్‌లపై వికెట్లు తీసేలా కొత్త వ్యూహాలను అవలంబించాలని కోచ్‌లు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, నెట్ బౌలర్ స్థాయి నుంచి దేశాన్ని గెలిపించే టెస్ట్ హీరోగా ఎదిగిన మానవ్ సుతార్ ప్రయాణం ఎందరో యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచింది.
1 పరుగుల పరంగా టెస్టుల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 2018లో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో గెలిచిన రికార్డు మెరుగైంది.
2 భారత్ తరఫున అరంగేట్రం టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండో బౌలర్ సుతార్ (6/33, 1/29). 1988లో వెస్టిండీస్‌పై నరేంద్ర హిర్వాణి రెండు ఇన్నింగ్స్‌లో 8/61, 8/75 ప్రదర్శనలతో ముందంజలో ఉన్నాడు.
3 ఒక టెస్టు మ్యాచ్‌లో 25 ప్లస్ రన్స్, ఐదు వికెట్ల స్పెల్‌తో పాటు మూడు క్యాచ్‌లు అందుకున్న మూడో క్రికెటర్ సుతార్. గతంలో అల్బర్ట్ ట్రాట్(1895), జోయల్ గార్నర్ (1977) ఈ ఫీట్ సాధించారు.
9 భారత్ తరఫున అరంగేట్రం టెస్టులోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొమ్మిదో ప్లేయర్ మానవ్. ఈ జాబితాలో ఆరుగురు బ్యాటర్లు కాగా, 2006లో పాక్‌పై ఆర్పీ సింగ్, 2011లో వెస్టిండీస్‌పై అశ్విన్ ఈ ఘనత సాధించారు.
15 అఫ్గానిస్థాన్‌తో ఇప్పటి వరకు 15 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన భారత్.. ఒక్కసారి కూడా ఓడిపోలేదు.