నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని మరోమారు నిరూపితమైంది. ఆడాలన్న కసికి పట్టుదల తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని చేతల్లో చూపిస్తున్నారు తెలంగాణ పారా వాలీబాల్ ప్లేయర్లు రాగుల నరేశ్ యాదవ్, వుసుకమల్ల కల్యాణ్, ఉప్పునూతల రాజు, గడిపల్లి ప్రశాంత్. వీరందరూ ఫోర్ట్ వెయిన్(అమెరికా) వేదికగా అక్టోబర్ 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ పారా వాలీబాల్(సిట్టింగ్) టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి రమేశ్, విజయ్ ఉన్నారు. అయితే అమెరికాలో జరిగే వరల్డ్ పారా వాలీబాల్లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్న నరేశ్, కల్యాణ్, రాజు, ప్రశాంత్కు ఆర్థిక ఇబ్బందులు ప్రతిబంధకంగా మారాయి. టోర్నీలో దేశం తరఫున బరిలోకి దిగాలంటే రూ.3.5 లక్షలు జాతీయ పారాలింపిక్ కమిటీకి చెల్లించాలని నరేశ్ పేర్కొన్నాడు.
ఇందులో ఎంట్రీ ఫీజు, విమానఖర్చులు, లోకల్ ప్రయాణం, వసతి సౌకర్యాలు, వీసా, ఇన్సురెన్స్, స్పోర్ట్స్ కిట్ కోసం కావాల్సి వస్తుందని తెలిపాడు. ఇంత మొత్తం భరించేందుకు తమ వద్ద అంత ఆర్థిక స్థోమత లేదని వాపోయాడు. ఎవరైనా స్పాన్సర్లు లేక దాతలు సాయం చేసేందుకు ముందుకు వస్తే అమెరికా గడ్డపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ‘పారా విభాగంలో ఇది మాకు ప్రతిష్టాత్మక టోర్నీ. భారత్ తరఫున ఆడటం అంత సులువు కాదు. మెరుగైన ప్రతిభతో జాతీయ జట్టుకు ఎంపికయ్యాం. కానీ ఆర్థిక లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎవరైనా ఆర్థికంగా అండగా నిలిస్తే సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాం. విజేతను సత్కరించడం కంటే, ముందే మద్దతుగా నిలిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు అవకాశముంటుంది’ అని నరేశ్ అన్నాడు. ఇదిలా ఉంటే గతేడాది బెంగళూరులో జరిగిన 2024 వరల్డ్ చాంపియన్షిప్లో రజత పతకం గెలిచిన భారత జట్టులో నరేశ్యాదవ్ సభ్యుడు. జాతీయ సీనియర్ స్థాయిలో నరేశ్ గత కొన్నేండ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. బయో ఇన్ఫార్మాటిక్స్లో ఎమ్టెక్ చేసిన నరేశ్..స్పోర్ట్స్ కోటాలో రెండేండ్ల క్రితం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాడు. ఐదేండ్ల వయసులో పోలియో కారణంగా నరేశ్ ఎడమ కాలు చచ్చుబడిపోయింది.
‘రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీపై మేము భారీగా ఆశలు పెట్టుకున్నాం. కానీ జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించేందుకు పారా ప్లేయర్లకు సరైన మార్గదర్శకాలు లేవు. సాధారణ అథ్లెట్లతో పోలిస్తే ప్రతిభలో మేము ఎవరికి తీసిపోం. వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా దేశం గర్వపడేలా రాణిస్తున్నాం. కానీ మాకు సరైన గుర్తింపు రావడం లేదు. టోర్నీలు గెలిచిన తర్వాత మద్దతుగా నిలువడం కంటే ప్రాతినిధ్యం వహించేందుకు సహకారం అందిస్తే మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అమెరికా టోర్నీకి వెళ్లేందుకు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలువాలని చూస్తున్నాం. దేశం గర్వపడేలా రాణించేందుకు మేము నలుగురం సిద్ధంగా ఉన్నాం. కావాల్సిందల్లా ఆర్థిక మద్దతే. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే మన తెలంగాణలో క్రీడల పట్ల సరైన దృక్పథం లేదు. ప్రభుత్వం ప్రకటనల వరకే పరిమితమవుతున్నా..ఆచరణలో అది కనిపించడం లేదు. ఇప్పటికైనా పారా ప్లేయర్ల విషయంలో ప్రభుత్వ ప్రాధామ్యాలు మారాలి. అప్పుడే దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసినట్లు అవుతుంది’ అని పారా ప్లేయర్లు తమ బాధను వెలిబుచ్చారు.