ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా మాట్లాడుకుంటున్న ఆటగాడు దినేష్ కార్తీక్. అభిమానులు ఆప్యాయంగా డీకే అని పిలుచుకునే ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది ఐపీఎల్లో అదిరిపోయే ఆటతో టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో మన్ననలు పొందాడు.
ఈ క్రమంలో డీకే గురించి మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. అతని దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయని చెప్పాడు. ఈ షాట్ల రేంజ్లో డీకేని సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిల్లీర్స్‌తో పోల్చాడు. ‘‘నేను వీళ్లిద్దరినీ సామర్థ్యంలో పోల్చడం లేదు. కానీ వాళ్లు ఆడగలిగే షాట్ల రేంజ్లో చూసుకుంటే ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి. మైదానంలో ఎటువైపు అయినా సరే వాళ్లు బంతిని బాదగలరు.
డీకే విషయంలో అతని ఫుట్‌వర్క్, బంతి లైన్ అండ్ లెంగ్త్‌ని ఉపయోగించుకునే విధానం అద్భుతంగా ఉంటుంది’’ అని పఠాన్ చెప్పాడు. అదే సమయంలో తను ఎదుర్కొనే మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడాలన్నా కూడా డీకే ఆడగలడని, ఒక ఫినిషర్‌కు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాల్లో అది ఒకటని ఈ మాజీ ఆల్‌రౌండర్ కొనియాడాడు.