ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా విరాజిల్లుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఢిల్లీ మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఏక్రగీవంగా ఎన్నికయ్యా డు. ఆదివారం ముంబైలో జరిగిన బీసీసీఐ 94వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సభ్యులు బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా 45 ఏండ్ల మిథున్‌ను ఎన్నుకున్నారు. వయసు నిబంధనల (70 ఏండ్లు)తో రోజర్ బిన్నీ తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానాన్ని మన్హాస్ భర్తీ చేశాడు. గత ఇద్దరు బీసీసీఐ అధ్యక్షులు (గంగూలీ, బిన్నీ) అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు కాగా మిథున్ మాత్రం తన సుదీర్ఘ కెరీర్ (157 ఫస్ట్‌క్లాస్, 130 లిస్ట్ ఏ, 55 ఐపీఎల్ మ్యాచ్‌లు)లో దేశవాళీలు మినహా భారత జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.
అధ్యక్ష రేసులో గంగూలీ, హర్భజన్, కిరణ్ మోరే వంటి మాజీల పేర్లు వినిపించినా కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు సంపూర్ణంగా మిథున్‌కే ఉండటంతో అతడి ఎన్నిక ఏకగ్రీవమైంది. మిథున్ అధ్యక్షుడిగా ఎన్నికవగా ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తమ స్థానాలను నిలుపుకున్నారు. కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చీఫ్ రఘురామ్ భట్ కోశాధికారిగా ఎన్నియ్యాడు. గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన ప్రభ్‌తేజ్ భాటియా.. సంయుక్త కార్యదర్శిగా ఎన్నికవగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా అపెక్స్ కౌన్సిల్ మెంబర్‌గా (దిలీప్ వెంగ్‌సర్కార్ స్థానంలో) వచ్చినట్టు బీసీసీఐ తెలిపింది. ధుమాల్‌తో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఖైరుల్ జమల్ మజుందార్‌కు స్థానం కల్పించారు.
సెలక్షన్ కమిటీలో ఆర్పీ సింగ్, ఓఝా
అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీలో మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓఝా చేరారు. శరత్, సుబ్రతో బెనర్జీ పదవీకాలం ముగియడంతో వారి స్థానాలను ఆర్పీ, ఓఝా భర్తీ చేయనున్నారు. శరత్.. జూనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా నియమితుడయ్యాడు. మహిళల సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా మాజీ క్రికెటర్ అమితా శర్మ నియమితురాలైనట్టు బీసీసీఐ తెలిపింది. భారత్ తరఫున 116 వన్డేలు ఆడిన ఆమె.. నీతూ డేవిడ్ స్థానాన్ని భర్తీ చేయనుంది. అమితా, శ్యామ డే, జయ శర్మ, స్రవంతి నాయుడుతో కూడిన ఈ కమిటీ పదవీకాలం మహిళల వన్డే ప్రపంచకప్ తర్వాత మొదలుకానుంది.