Lionel Messi |అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మరోసారి అసాధారణ ప్రతిభ చాటుకున్నాడు. ఆరోసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన మెస్సీ.. రెండు గోల్స్‌తో రికార్డు సృష్టించాడు. మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
బుధవారం గ్రూప్-జెలో అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్‌లో ఫస్టాఫ్‌లో తొలి గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్ల గోల్స్ ఆఫ్‌సైడ్ కారణంగా రద్దయ్యాయి. అనంతరం 17వ నిమిషంలో అలెక్సిస్ మాక్ అలిస్టర్ ఇచ్చిన చక్కటి పాస్‌ను అందుకున్న మెస్సీ.. ఎడమ కాలి షాట్‌తో బంతిని టాప్ కార్నర్‌లోకి పంపి అద్భుతమై గోల్ చేశాడు. ఈ గోల్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు.
ఇక సెకండాఫ్‌లో కూడా మెస్సీ జోరు కొనసాగింది. 60వ నిమిషంలో మరోసారి అలిక్సెస్ మాక్ అలిస్టర్ చేసిన లాంగ్ షాట్‌ను అల్జీరియా గోల్ కీపర్ లూకా జిదాన్ అడ్డుకున్నాడు. అయితే రీబౌండ్‌గా వచ్చిన బంతిని మెస్సీ వేగంగా అందుకుని గోల్ పోస్టులోకి పంపించాడు. మెస్సీ డబుల్ గోల్స్‌తో కాన్సాస్ సిటీలోని స్టేడియం మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. మెస్సీ.. మెస్సీ నినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది.