కోల్‌కతా: భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు వెసీ పేస్(Vece Paes) ఇవాళ కన్నుమూశారు. 1972లో ముచిచ్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఆడిన భారత జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహించాడు. ఆ మెగా క్రీడల్లో ఇండియా హాకీ జట్టుకు కాంస్య పతకం దక్కింది. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండ్ పేస్ తండ్రి ఈయనే. వెసీ పేస్ వయసు 80 ఏళ్లు. గురువారం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెసీ పేస్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. కోల్‌కతాలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
భారత క్రీడా చరిత్రలో వెసీ పేస్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. భారత హాకీ జట్టులో ఆయన మిడ్‌ఫీల్డర్‌గా ఆడాడు. ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ లాంటి అనేక క్రీడల్లోనూ వెసీ పేస్‌కు ప్రావీణ్యం ఉన్నది. 1996 నుంచి 2022 వరకు ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌గా కూడా ఆయనకు గుర్తింపు ఉన్నది. అనేక క్రీడా సంఘాలకు మెడికల్ కన్సల్టెంట్‌గా చేశారు. ఆసియా క్రికెట్ మండలి, బీసీసీఐ, డేవిస్ కప్ జట్టుకు మెడికల్ కన్సల్టెంట్‌గా చేశారు.