బాకు (అజర్బైజాన్): వేదికతో సంబంధం లేకుండా పాల్గొన్న ప్రతి టోర్నీలోనూ తనదైన ముద్ర వేస్తున్న తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్.. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్‌కప్‌లో మరో స్వర్ణంతో మెరిసింది. అజర్బైజాన్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకం పట్టిన ఇషా.. ఆదివారం మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లోనూ స్వర్ణం కొల్లగొట్టింది. ఇషా సింగ్, మనూబాకర్, రిథమ్ సాంగ్వాన్తో కూడిన భారత జట్టు తుదిపోరులో చైనాను చిత్తు చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఒలింపియన్ మనూబాకర్ను వెనక్కి నెడుతూ మన ఇషా 300 పాయింట్లకు గానూ 288 ఖాతాలో వేసుకోవడం విశేషం. మరోవైపు పురుషుల రైఫిల్ త్రి పొజిషన్లో కాంస్య పతకం నెగ్గిన అఖిల్ షెరాన్.. పారిస్ ఒలింపిక్స్ (2024) బెర్త్ దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో అఖిల్, ప్రతాప్ సింగ్, నీరజ్ కుమార్ త్రయం స్వర్ణ పతకంతో మెరిసింది.