అర్లింగ్టన్ : ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్‌కు అదిరిపోయే శుభారంభం దక్కింది. డల్లాస్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన గ్రూపు-ఎల్ పోరులో ఇంగ్లండ్ 4-2 తేడాతో క్రొయేషియాపై అద్భుత విజయం సాధించింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య జరిగిన పోరు ఆద్యంతం ఆసక్తి కల్గించింది. సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం కీలకమైన సెమీఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి ఇంగ్లండ్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ తరఫున హ్యారీ కేన్(12ని, 42ని) డబుల్ గోల్స్‌తో అదరగొట్టగా, జూడ్ బెల్లింగ్‌హామ్(47ని), మార్కస్ రాష్‌ఫోర్డ్(85ని) ఒక్కో గోల్ చేశారు. మరోవైపు తామేం తక్కువ కాదన్నట్లు మార్టిన్ బతురినా(36ని), పీటర్ ముసా(45+5ని)..క్రొయేషియాకు గోల్స్ అందజేశారు. ఈ విజయంతో మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఇంగ్లండ్ గ్రూపులో అగ్రస్థానంలోకి దూసుకురాగా, క్రొయేషియా(0) నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.
సుదీర్ఘ కాలంగా ఊరిస్తూ వస్తున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీని ఈసారి ఎలాగైనా ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ కసిని క్రొయేషియాతో తొలి మ్యాచ్‌లోనే చేతల్లో చూపెట్టింది. జర్మనీకి చెందిన థామస్ టుచెల్ శిక్షణలో రాటుదేలిన ఇంగ్లండ్ కొత్తగా కనిపించింది. తమ శైలికి భిన్నంగా ఆది నుంచే అటాకింగ్ కనబరుస్తూ ప్రత్యర్థి క్రొయేషియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. మ్యాచ్ 12వ నిమిషంలో క్రొయేషియా స్టార్ ైస్ట్రెకర్ లూకా మోద్రిచ్..ఇంగ్లండ్ డిఫెండర్ నోని మదుకెను..పెనాల్టీ ఏరియాలో పడేయడంతో దక్కిన పెనాల్టీ స్పాట్‌ను హ్యారీ కేన్ గోల్‌గా మలువడంతో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ క్రొయేషియా వెంటనే పుంజుకుని పోటీలోకి వచ్చింది. 36వ నిమిషంలో బంతిని అందుకున్న మార్టిన్..ఇంగ్లండ్ గోల్‌కీపర్ జోర్డన్ పిక్‌ఫోర్డ్ తప్పిదాన్ని అనుకూలంగా మలుచుకుంటూ గోల్ కొట్టడంతో స్కోరు 1-1తో సమమైంది.
క్రొయేషియాను అడ్డుకునేందుకు దూకుడును ఎంచుకున్న ఇంగ్లండ్ అనుకున్న ఫలితాన్ని సాధించింది. ఆరు నిమిషాల వ్యవధిలో కార్నర్ నుంచి డెక్లాన్ రైస్ కొట్టిన బంతిని కేన్ సూపర్ హెడర్‌తో గోల్ చేయడంతో ఇంగ్లండ్ 2-1లోకి వెళ్లింది. ఆధిక్యంతో కీలకమైన ద్వితీయార్ధంలోకి వెళ్దామనుకున్న ఇంగ్లండ్‌కు క్రొయేషియా ఝలక్ ఇచ్చింది. ప్రథమార్ధం ఇంజ్యూరీ టైమ్‌లో ఇవాన్ పెర్సిచ్ ఇచ్చిన పాస్‌ను పీటర్ గోల్ చేయడంతో స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఇక లాభం లేదనుకున్న ఇంగ్లండ్ తమ దాడులకు మరింత పదును పెట్టింది. ద్వితీయార్ధం మొదలైన రెండో నిమిషానికే ఎలియట్ అండర్సన్ అందించిన పాస్‌ను చాకచక్యంగా అందిపుచ్చుకున్న బెల్లింగ్‌హామ్ గోల్ చేయడంతో ఇంగ్లండ్ 3-2లోకి దూసుకెళ్లింది. స్కోరు సమం చేసేందుకు క్రొయేషియా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్ డిఫెన్స్‌ను ఛేదించడంలో క్రొయేషియా విఫలమైంది. ఓవైపు తమదైన రీతిలో అటాకింగ్ కొనసాగించిన ఇంగ్లండ్..మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా..బుకాయో సాకా పాస్‌ను రాష్‌ఫోర్డ్ సూపర్ గోల్‌గా మలువడంతో ఇంగ్లండ్‌కు 4-2తో విజయం ఖరారైంది.
ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. మెగాటోర్నీలో టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా భావిస్తున్న పోర్చుగల్‌కు అనామక డీఆర్(డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్) కాంగో దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన గ్రూపు-కే పోరు 1-1తో డ్రాగా ముగిసింది. జావో నివెస్(6ని) పోర్చుగల్‌కు ఏకైక గోల్ అందించగా, యువానో విస్సా(45+5ని) కాంగో తరఫున కొత్త చరిత్ర లిఖించాడు. మ్యాచ్ మొదలైన ఆరో నిమిషంలోనే నివెస్ గోల్‌తో పోర్చుగల్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రథమార్ధం ఇంజ్యూరీ టైమ్‌లో విస్సా కండ్లుచెదిరే రీతిలో కొట్టిన హెడర్ గోల్‌తో కాంగో ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి స్కోరు నమోదు చేసింది.

52 ఏండ్ల తర్వాత తిరిగి మెగాటోర్నీకి అర్హత సాధించిన ఈ ఆఫ్రికన్ పసికూన తమ తొలి పోరులోనే పోర్చుగల్‌కు చుక్కలు చూపెట్టింది. ఓవైపు పోర్చుగల్ స్టార్ ైస్ట్రెకర్ క్రిస్టియానో రొనాల్డో చేసిన గోల్ ప్రయత్నాలు నెరవేరలేకపోవడంతో ఆ దేశ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కెరీర్లో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న 41 ఏండ్ల రొనాల్డో ఈసారైనా..తన కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన డీఆర్ కాంగో..తమ తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మిగతా మ్యాచ్‌ల్లో కొలంబియా 3-1తో ఉజ్బెకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. డానియెల్ మునోజ్ (40ని), లూయిస్ డియాజ్ (65ని), జెమింటన్ కాంపెజ్ (90+9ని) కొలంబియా తరఫున గోల్స్ చేశారు. పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఘనా 1-0తో గెలిచి ముందంజ వేసింది.
మెక్సికో x దక్షిణ కొరియా ఉ. 6.30 నుంచి
అమెరికా x ఆస్ట్రేలియా అ.రా. 12.30 నుంచి
స్కాట్లాండ్ x మొరాకో తె.జా. 3.30 నుంచి