Wimbledon | లండన్: వింబుల్డన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరేట్లుగా భావిస్తున్న స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా ఇంటిబాట పడుతున్నారు. ఇదివరకే నవామి ఒసాకా, డిఫెండింగ్ చాంపియన్ వొండ్రుసోవా, వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఇంటిబాట పట్టగా తాజాగా కోకో గాఫ్ (అమెరికా), ఎమ్మా రడుకాను (బ్రిటన్) సైతం క్వార్టర్స్‌కు చేరకుండానే నిష్క్రమించారు.
ఆదివారం ముగిసిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రడుకాను 2-6, 7-5, 2-6తో లులు సన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది. రెండో సీడ్ కోకో గాఫ్ 4-6, 3-6తో అమెరికాకే చెందిన ఎమ్మా నవర్రొ చేతిలో చిత్తైంది. నాలుగో సీడ్ రిబాకినా 6-3, 6-0తో అన్నా కలిన్సయను ఓడించింది.
మెయిన్ డ్రాలో టాప్‌సీడ్ ర్యాంకు కలిగిన అమ్మాయిల్లో రిబాకినా ఒక్కతే బరిలో నిలవడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఇటలీ ప్లేయర్ లొరెంజొ ముసెట్టి 4-6, 6-3, 6-3, 6-2తో పెర్రికర్డ్ (ఫ్రాన్స్)ను ఓడించి క్వార్టర్స్ చేరుకున్నాడు. తద్వారా ఈ టోర్నీలో పలోని, సిన్నర్ తర్వాత క్వార్టర్స్ చేరిన మూడో ఇటాలియన్గా నిలిచాడు. తొమ్మిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6-2, 6-4, 4-6, 6-3తో ఆర్థర్ ఫిల్స్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.
జ్వెరెవ్ నిష్క్రమణ
వింబుల్డన్ టోర్నీలో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్ పోరులో జ్వెరెవ్ 6-4, 7-6(7-4), 4-6, 6-7(3-7), 3-6తో ఫ్రిట్జ్ చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు.