ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత యువ ఆటగాడు సుమిత్ నాగల్ పోరాటం ముగిసింది. తొలి పోరులో సీడెడ్ ప్లేయర్‌కు షాకిచ్చిన నాగల్.. రెండో రౌండ్లో పరాజయం పాలయ్యాడు. మహిళల విభాగంలో గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన టైబ్రేకర్‌లో మూడో సీడ్ రిబాకినాపై బ్లింకోవా విజయం సాధించగా.. టాప్ సీడ్ స్వియాటెక్, అజెరెంక, ఒస్టపెంకో మూడో రౌండ్లో అడుగుపెట్టారు.
మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. ఆస్ట్రేలియా ఓపెన్ రెండో రౌండ్లో భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఓటమి పాలయ్యాడు. క్వాలిఫయింగ్ టోర్నీతో పాటు తొలి రౌండ్లో అద్వితీయ ప్రదర్శనతో చరిత్ర తిరగరాసిన నాగల్.. రెండో రౌండ్లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో నాగల్ 6-2, 3-6, 5-7, 4-6తో జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడాడు. తొలి సెట్లో నాగల్ పూర్తి ఆధిపత్యం కనబర్చగా.. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన షాంగ్ దుమ్మురేపాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన పోరులో 7 ఏస్‌లు కొట్టిన నాగల్ 37 విన్నర్లు బాదగా.. 8 ఏస్‌లు సంధించిన షాంగ్ 55 విన్నర్లతో ముందంజలో నిలిచాడు. రెండో రౌండ్లో ఓడినప్పటికీ 26 ఏండ్ల నాగల్‌కు దాదాపు కోటి రూపాయల నగదు బహుమతి దక్కనుంది.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్న జంట రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 7-6, (7/5), 4-6, 7-6 (10/2)తో జేమ్స్ డక్‌వర్త్-మార్క్ పోల్మన్స్ జంటపై గెలిచింది. మరో భారత జోడీ విజయ్ సుందర్ ప్రశాంత్-అనిరుధ్ చంద్రశేఖర్ పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ అల్కరాజ్ 6-4, 6-7 (3/7), 6-3, 7-6 (7/3)తో సొన్గెపై.. మూడో సీడ్ మెద్వెదెవ్ 3-6, 6-7 (1/7), 4-6, 7-6 (7/1), 6-0తో రుసువోరీపై.. దిమిత్రోవ్ 6-3, 6-2, 4-6, 6-4తో కొక్కినాకిస్పై.. జ్వెరెవ్ 7-5, 3-6, 4-6, 7-6 (7/5), 7-6 (10/7)తో కెలిన్పై గెలుపొందారు.
భళా బ్లింకోవా
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. మెల్బోర్న్లో మేజర్ టెన్నిస్ టోర్నీల చరిత్రలోనే సుదీర్ఘమైన టైబ్రేకర్ అభిమానులను అలరించింది. నిరుడు ఇక్కడ రన్నరప్‌గా నిలిచిన మూడో సీడ్ రిబాకినాపై అన్నా బ్లింకోవా అద్భుత విజయం సాధించింది. మూడు గంటల పాటు సాగిన పోరులో అన్‌సీడెడ్ బ్లింకోవా 6-4, 4-6, 7-6 (22/20)తో రిబాకినాను మట్టికరిపించింది. చివరి సెట్లో ఇరువురు ప్లేయర్లు కొదమ సింహాల్లా పోరాడగా.. ఒత్తిడిని జయిస్తూ నిలిచిన బ్లింకోవా విజయ దరహాసం చేసింది. అరగంటకు పైగా సాగిన టై బ్రేకర్ హోరాహోరీగా సాగగా.. మ్యాచ్ అనంతరం వణికిపోతున్న శరీరంతో బ్లింకోవా ‘సాధించాను’ అంటూ బిగ్గరగా అరిచి సంబురాలు చేసుకుంది. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ 6-4, 3-6, 6-4తో కాలిన్స్‌పై గెలిచింది.