కష్టకాలంలో ఆర్థికంగా చేయుత నిచ్చిన దేశానికి ఎలీనా రబాకినా.. తగిన గుర్తింపు సాధించిపెట్టింది. ఆల్ఇగ్లండ్ క్లబ్లో విజేతగా నిలిచి వింబుల్డన్ టైటిల్ పట్టిన తొలి కజికస్థాన్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. రష్యాలో పుట్టి పెరిగిన ఈ టెన్నిస్ స్టార్.. గత ఐదేండ్లుగా తనకు సహకారిస్తున్న కజకిస్థాన్ తరఫున ప్రొఫెషనల్ ప్లేయర్‌గా కొనసాగుతున్నది. వింబుల్డన్ నెగ్గిన తొలి ఆఫ్రికా ప్లేయర్‌గా నిలువాలనుకున్న జాబర్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నేడు జరుగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిర్గియోస్‌తో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
వింబుల్డన్: అద్వితీయ ఆటతీరుతో విజృంభించిన ఎలీనా రబాకినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రబాకినా 3-6, 6-2, 6-2తో జాబర్ (ట్యూనిషియా)పై గెలుపొందింది. తద్వారా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి కజకిస్థాన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. గంటా 48 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో 23 ఏండ్ల రబాకినా నాలుగు ఏస్‌లు సంధించి 29 విన్నర్లు కొట్టింది. మరోవైపు 24 అనవసర తప్పిదాలు చేసిన జాబర్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది.
పవర్ఫుల్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ రబాకినా.. తొలి సెట్ కోల్పోయిన అనంతరం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజృంభించింది. గ్రాండ్‌స్లామ్ ప్రారంభానికి ముందే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో.. రష్యాతో పాటు బెలారస్‌కు చెందిన ప్లేయర్లను టోర్నీలో ఆడనివ్వకూడదని వింబుల్డన్ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. దీంతో రబాకినా బరిలో దిగడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తాను గత ఐదేండ్లుగా కజకిస్థాన్ తరఫున ఆడుతున్నట్లు రబాకినా నిరూపించుకోవడంతో వివాదం సమసిపోయింది. రెండు వారాలు తిరిగేసరికి కొత్త చరిత్ర లిఖిస్తూ.. చాంపియన్‌గా నిలిచిన రబాకినాపై క్రీడా దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు.
విజేత
రబాకినా
రన్నరప్
జాబర్