ఇండోర్: న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో సెంచరీతో తన తండ్రి సంతోషపడకపోవచ్చని భారత్ యువ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ సరదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం భారత్ హెడ్ కోచ్ రాహుల్ద్రవిడ్తో మాట్లాడుతూ గిల్ ఈ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీని తాను భారీ స్కోరుగా మల్చలేకపోయానని, సెంచరీలను భారీ స్కోర్లుగా మలిచే ప్రయత్నం చేస్తుండాలని తన తండ్రి తనకు చెబుతూ ఉంటాడని గిల్ ద్రవిడ్‌తో అన్నాడు. అసలు వారి మధ్య సరదా సంభాషణ ఎలా మొదలైందంటే..
న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రోహిత్, గిల్ సెంచరీలకుతోడు బౌలింగ్‌లో శార్ధూల్, కుల్దీప్లు మూడోసి వికెట్ల చొప్పున తీయడం భారత జట్టు విజయంలో కీలకంగా మారాయి. ఈ గెలుపుతో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను కూడా 3-0తో క్లీన్ స్వీప్ చేసి భారత్ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్ 1 గా నిలిచింది. అంతకుముందు శ్రీలంకతో సిరీస్‌ను కూడా భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
మీరిచ్చిన కాన్ఫిడెన్సే బాగా ఆడేలా చేసింది: గిల్
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మొత్తం 360 పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న సందర్భంగా కోచ్ ద్రవిడ్, గిల్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. ‘క్రికెట్లో నాకు వన్డే ఫార్మాట్ అంటేనే చాలా ఇష్టం. ఈ ఫార్మాట్లో ఆడటాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. నేను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పుడు సరిగా ఆడగలనో లేదోనని ఆందోళన చెందా. కానీ మీరు (రాహుల్ ద్రవిడ్), రోహిత్ భాయ్ ఇచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను అద్భుతంగా ఆడేలా చేశాయి’ గిల్ చెప్పాడు.
నీలో వయసుకు మించిన పరిణతి ఉంది: ద్రవిడ్
అందుకు ద్రవిడ్ స్పందిస్తూ.. ‘నువ్వు బ్యాటింగ్ చేయడాన్ని ప్రేమిస్తున్నావు. ఒక కోచ్‌గా నీ పరుగుల ఆకలిని నేను గమనించా. నీలో వయసుకు మించిన పరిణతి కనిపిస్తున్నది. నిన్ను దగ్గరి నుంచి చూసిన ఎవరైనా ఈ మాట అంటారు. పైగా రోహిత్, కోహ్లీ లెజండరీ బ్యాటర్లతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం నీకు దక్కింది. రోహిత్ నీతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తాడు. ఒకవేళ అతను వెళ్లిపోతే వెంటనే కోహ్లీ వచ్చేస్తాడు’ అన్నాడు.
2000 పరుగుల మైలురాయి దాటిన గిల్
న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో సెంచరీతో (78 బంతుల్లో 112) గిల్ అంతర్జాతీయ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని దాటాడు. కాగా, గిల్ తన అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 37 ఇన్నింగ్స్ ఆడి 47.62 సగటుతో 2048 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, తొమ్మిది అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 208 పరుగులు.
టెస్టు క్రికెట్లో 13 మ్యాచ్‌లలో 25 ఇన్నింగ్స్ ఆడిన గిల్ 32 సగటుతో 736 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 110 పరుగులు. వన్డేల్లో 21 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 73.76 సగటుతో 1254 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో గిల్ కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 19.33 సగటుతో 58 పరుగులు చేశాడు. అందులో 46 పరుగులే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.
2023లో గిల్ శుభారంభం
ఈ ఏడాది (2023లో) గిల్ శుభారంభమే చేశాడు. మొదటి నెలలోనే ఆరు వన్డేలు ఆడి 113.40 సగటుతో 567 పరుగులు రాబట్టాడు. అందులో మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. అంతేగాక వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 208 పరుగులు కూడా ఈ ఏడాదిలోనే నమోదయ్యింది.