చెస్‌లో మరో చిచ్చరపిడుగు దూసుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచ చెస్‌కు దిక్సూచిలా మారిన భారత్ నుంచి మరో చాంపియన్ పుట్టుకొచ్చాడు. పిట్ట కొంచెం కూత ఘనమన్న రీతిలో ఎనిమిదేండ్ల ప్రాయంలోనే ప్రపంచ క్యాడెట్ చాంపియన్‌గా నిలిచి అందరినీ నివ్వెరపరిచాడు. పజిల్స్‌తో మొదలైన అతని ప్రస్థానం ఎత్తులకు పైఎత్తులు వేసే చెస్‌లో ప్రపంచ స్థాయికి చేరింది. పిన్న వయసులోనే చదరంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆ చిన్నోడు మరెవరో కాదు మన హైదరాబాద్‌కు చెందిన దివిత్రెడ్డి. కొడుకు ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు మెరుగైన శిక్షణతో దివిత్‌ను రాటుదేలేలా చేసిన వైనంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
Divith Reddy | మరో తెలంగాణ తార.. ప్రపంచ క్రీడా యవనికపై తళుక్కున మెరిసింది. ఇటలీలో తాజాగా ముగిసిన అండర్-8 ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో దివిత్రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాడు. ఆఖరి రౌండ్ వరకు ఆసక్తికరంగా సాగిన మెగాటోర్నీలో ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా వెరవకుండా రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ ఏకంగా ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచాడు. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే చెస్‌లో అసమాన విజయాలు సాధిస్తున్న దివిత్రెడ్డి ప్రస్థానం ఆసక్తికరం. ప్రస్తుతం ఫిడే రేటింగ్‌లో 1784 పాయింట్లతో కొనసాగుతున్న దివిత్.. ప్రపంచంలోనే పిన్న వయసు గ్రాండ్‌మాస్టర్ రికార్డును సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో దూసుకెళుతున్నాడు. అమెరికాకు చెందిన అభిమన్యు మిశ్రా(12ఏండ్ల 4 నెలల, 25రోజులు) అతి పిన్న వయసు జీఎంగా కొనసాగుతున్నాడు. దీన్ని ఎలాగైనా దాటేయాలన్న ఆకాంక్షతో దివిత్ ఉన్నాడని అతని తండ్రి మహేశ్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
గుకేశ్కే చెక్ పెట్టినోడు:
దివిత్ మామూలు చెస్ ప్లేయర్ కాదు. చదరంగం కోసమే పుట్టాడా అన్న రీతిలో ఊహ తెలియని వయసు నుంచే చెస్‌లో ఊహించని ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేయడంలో ఆరితేరాడు. హైదరాబాద్‌లో రెండేండ్ల క్రితం జరిగిన ఒక టోర్నీలో పెద్ద కండ్లు జోడు పెట్టుకున్న ఒక బుడతడు.. భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌ను ఓడించి అందిరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరేండ్ల ప్రాయంలో దివిత్ చూపించిన టెక్నిక్కు ఫిదా అయిపోయిన గుకేశ్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అదే టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్‌తోనూ దివిత్ పోటీపడ్డాడు. రెండేండ్లు తిరిగి చూస్తే అండర్-8 ప్రపంచ క్యాడెట్ టోర్నీలో దివిత్ విజేతగా నిలిస్తే..గుకేశ్ ప్రస్తుతం డింగ్ లిరెన్‌తో ప్రపంచ టైటిల్ కోసం పోటీపడుతున్నాడు.
పజిల్స్‌తో మొదలై:
దివిత్ చెస్ కెరీర్ చిన్నతనంలోనే మొదలైంది. తొలుత పజిల్స్ పట్ల దివిత్ ఆసక్తిని గమనించిన అతని తల్లిదండ్రులు ఒక పజిల్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు. కానీ అది పెద్దగా ప్రయోజనం కల్గించలేదు. దీంతో ఆరేండ్ల ప్రాయంలో చెస్‌లో అడుగుపెట్టిన దివిత్..అండర్-8 జాతీయ టోర్నీలో తొలిసారి పోటీపడ్డాడు. అక్కడి నుంచి రామకృష్ణ దగ్గర ఓనమాలు నేర్చుకున్న దివిత్..ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగాడు. విశాఖకు చెందిన రామకృష్ణతో ఆన్లైన్ ద్వారా దివిత్ చెస్‌లో చాలా వరకు మెళకువలు నేర్చుకున్నాడు. అప్పట్లో కొవిడ్-19 కారణంగా ఆన్లైన్ క్లాస్‌లు బాగా ఉపయోగపడగా, తన భార్య దివిత్ కెరీర్ తీర్చిదిద్దేందుకు బాగా కష్టపడ్డట్లు తండ్రి మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకానొక సమయంలో స్కూల్ కంటే ఎక్కువగా చెస్ ప్రాక్టీస్‌లోనే గడుపుతుండే వాడని తెలిపాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈస్థాయికి చేరిన దివిత్..చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ తరహాలో అటాకింగ్ గేమ్‌ను ఇష్టపడుతాడని చెప్పుకొచ్చాడు. పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందేందుకు తన కొడుకు కష్టపడుతున్నట్లు మహేశ్ పేర్కొన్నాడు.