హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(Dhoni).. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చికిత్స తీసుకోనున్నారు. సోమవారం జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్లో ట్రోఫీని చెన్నై జట్టు అయిదోసారి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో మోకాలి గాయంతోనే ధోనీ మ్యాచ్లు ఆడేశాడు. మోకాలి గాయానికి చెందిన విషయంలో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో ధోనీ చికిత్స తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది. మరో వారం రోజుల్లో ఆ ట్రీట్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ ఆరంభంలో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ధోనీ మోకాలి గురించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని, అతని కదలికల్లో దాన్ని గుర్తించవచ్చు అని, అది ఆయన్ను కాస్త ఇబ్బందిపెడుతోందని ఫ్లెమింగ్ తెలిపాడు. చెన్నై స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ సమయంలో ధోనీ స్టేడియంలో ల్యాప్ కూడా నిర్వహించాడు. అయితే ఆ సమయంలో అతను మోకాలికి ఐస్ ప్యాక్ పెట్టుకున్నాడు.