‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా టీ20 క్రికెట్‌కు తగ్గట్టుగా ఆటగాళ్లు ఉండి.. దిగ్గజ ఆటగాళ్లు సారథ్యం వహించినా, అంతర్జాతీయ క్రికెటర్ల ప్రాతినిథ్యం ఉన్నా, జట్టుకు అభిమానుల నుంచి ఆశించిన మద్దతు లభించినా ఐపీఎల్లో కప్పు కొట్టని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. 2008లో మొదలైన ఈ లీగ్‌లో అరంగేట్రం చేసిన (అప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్) ఈ జట్టు.. పేరు మార్చుకున్నా (2018 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్) ఆటతీరు మాత్రం మారడం లేదు.
18 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న ఢిల్లీ.. ఒక్కటంటే ఒక్కసారి (2020) మాత్రమే ఫైనల్ చేరుకోగా మూడుసార్లు ప్లేఆఫ్స్‌కు వచ్చింది. ఏకంగా 12 సార్లు లీగ్ దశకే (గత నాలుగు సీజన్లు కూడా) పరిమితమైన ఆ జట్టు.. 19వ సారైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. గతంతో పోలిస్తే పేపర్‌పై బలంగానే కనిపిస్తున్న క్యాపిటల్స్.. మైదానంలోకి వచ్చేసరికి మాత్రం మిగిలిన సీజన్ల మాదిరిగానే తేలిపోతుందా? లేక స్థిరమైన ప్రదర్శనలతో గాడిలో పడుతుందా? అన్నదిఆసక్తికరం. గత వైఫల్యాల నేపథ్యంలో ఈసారి జట్టులో భారీ మార్పులు చేసి నూతనోత్సాహంతో బరిలోకి దిగుతున్న క్యాపిటల్స్ రాత ఈసారైనా మారుతుందా? అన్నది ఆసక్తికరం.
గత రెండు సీజన్లలో ఢిల్లీని ప్రధానంగా వేధించింది ఓపెనింగ్ సమస్య. నిరుడు డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నా వాళ్లు వాటిని అందుకోలేకపోయారు. ఫ్రేజర్ అయితే అట్టర్ ప్లాఫ్. 2025లో ఈ జోడీ సగటు 21.78గా నమోదైంది. కానీ ఈసారి ఆ జట్టు ఆ ఇద్దరినీ పక్కనబెట్టి ఇంగ్లిష్ ఆటగాడు బెన్ డకెట్, లంక విధ్వంసకర ఓపెనర్ పతుమ్ నిస్సంకను బరిలోకి దించనుంది. ఏ క్షణంలో అయినా మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగల సత్తా వీరికుంది. పృథ్వీ షా, పొరెల్ రూపంలో ఢిల్లీకి బ్యాకప్ ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నా ఈ ఇద్దరూ ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు.
ఢిల్లీ బ్యాటింగ్‌కు పెద్దగా సమస్య లేదు. నిరుడు జట్టుతో చేరిన కేఎల్ రాహుల్ ఆ సీజన్లో నిలకడగా (53.9 సగటుతో 539 రన్స్) ఆడాడు. అతడే ఆ జట్టుకు పెద్ద బలం. మూడో స్థానంలో వచ్చే రాహుల్.. ఓపెనింగ్ కూడా చేయగలడు. నితీశ్ రాణా, డేవిడ్ మిల్లర్, సమీర్ రజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ వంటి హిట్టర్లు క్యాపిటల్స్ సొంతం. కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా బంతితోనే గాక బ్యాట్‌తో రాణించగల సమర్థుడు.
బ్యాటర్ల మాదిరిగానే బౌలింగ్‌లోనూ క్యాపిటల్స్ పటిష్టంగానే కనబడుతున్నది. ఆ జట్టు ప్రధాన పేస్ బలం ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్. అయితే అతడు ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనేదానిపై స్పష్టత లేదు. ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం అతడు దూరం కానున్నాడు. స్టార్క్ లేకుంటే ఢిల్లీ బౌలింగ్ అంతా దేశవాళీ బౌలర్లమీదే పడుతుంది. యార్కర్ల నటరాజన్, ముకేశ్ కుమార్‌కు తోడు దేశవాళీల్లో సంచలన ప్రదర్శనతో వేలంలో రూ. 8.4 కోట్ల ధరతో ఢిల్లీ దక్కించుకున్న జమ్మూకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీపై ఆ జట్టు భారీ అంచనాలే పెట్టుకుంది. ఇప్పటికే సెలక్టర్ల దృష్టిలో పడిన నబీ.. ఐపీఎల్‌లోనూ అదరగొడితే టీమ్ఇండియా గడపతొక్కడం లాంఛనమే. మరి స్టార్క్ గైర్హాజరీలో నటరాజన్, ముకేశ్, నబీ, సఫారీ పేసర్ ఎంగిడి ఏ మేరకు రాణిస్తారనేది కీలకం. అక్షర్, కుల్దీప్‌నకు అండగా విప్రాజ్ నిగమ్‌తో స్పిన్ త్రయం పటిష్టంగా ఉంది.
2025 సీజన్ అర్థ భాగంలో ఢిల్లీ ప్రదర్శన చూస్తే ఈసారి ప్లేఆఫ్స్‌తో పాటు కప్పు కొడుతుందా? అన్నంత రేంజ్లో ఉంది. ఆడిన 6 మ్యాచ్‌లకు గాను ఏకంగా 5 గెలిచిన అక్షర్ సేన.. ఎప్పట్లాగే గాడి తప్పింది. ఆ తర్వాత 9 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచి ఐదో స్థానంతో ముగించింది.