భువనేశ్వర్: భారత్‌లో జరగనున్న పురుషుల హాకీ ప్రపంచకప్-2023 టోర్నీలో పాల్గొనేందుకు డిఫెండింగ్ చాంపియన్ అయిన బెల్జియన్ టీమ్ ఒడిశాకు చేరుకుంది. ప్రపంచ హాకీ దిగ్గజాలతో కూడిన ఈ బెల్జియం జట్టుకు బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమనాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. బెల్జియం జట్టు ఈ ప్రపంచకప్ లీగ్ దశలో పూల్-బిలో జర్మనీ, జపాన్, కొరియా జట్లతో తలపడనుంది. జనవరి 14న భువనేశ్వర్‌లో కొరియాతో తొలి మ్యాచ్ ఆడనుంది.
కాగా, ఫెలిక్స్ డెనాయెర్ నేతృత్వంలోని బెల్జియం టీమ్ 2018 ప్రపంచకప్ ప్రదర్శననే పునరావృతం చేసి ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అదేగనక జరిగితే వరుసగా రెండు హాకీ ప్రపంచకప్‌లు గెలిచిన నాలుగో జట్టుగా బెల్జియం నిలువనుంది. గతంలో పాకిస్థాన్ (1978, 1982), జర్మనీ (2002, 2006), ఆస్ట్రేలియా (2014, 2014) జట్లు మాత్రమే వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచాయి.
బెల్జియం కెప్టెన్ ఫెలిక్స్ డెనాయెర్ మీడియాతో మాట్లాడుతూ.. తాము టోర్నీకి అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. స్పెయిన్‌లోని ట్రెయినింగ్ క్యాంప్‌లో తాము ప్రాక్టీస్ చేశామని, ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించామని తెలిపాడు. గత ప్రపంచకప్లోలాగే ఈ ప్రపంచకప్‌లో కూడా తాము అద్భుత ప్రదర్శన చేస్తామన్న విశ్వాసం ఉన్నదని ఫెలిక్స్ పేర్కొన్నాడు.