చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్(78: 49 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) తనదైన శైలిలో చెలరేగిపోయాడు. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరు అదరగొట్టింది. మాక్స్వెల్ విధ్వంసానికి తోడు చివర్లో ఏబీ డివిలియర్స్(76 నాటౌట్: 34 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు ) అద్భుత అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడిన మాక్సీ, ఏబీడీ బౌండరీలతో
విధ్వంసం సృష్టించారు.
బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. మిస్టరీ స్పిన్నర్ చక్రవర్తి తన తొలి ఓవర్ రెండో బంతికే విరాట్ కోహ్లీ(5)ని ఔట్ చేశాడు. త్రిపాఠి అద్భుత క్యాచ్‌కు విరాట్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్‌మన్ రజత్ పటిదార్(1)ను ఆఖరి బంతికి బౌల్డ్ చేసి బెంగళూరును దెబ్బకొట్టాడు. 9/2తో కష్టాల్లో ఉన్న జట్టును పడిక్కల్‌తో కలిసి మాక్సీ 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మాక్స్వెల్ దూకుడును ఏ బౌలరూ అడ్డుకోలేకపోయారు. ఆరంభం నుంచి తనదైన ఆటతీరుతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. మూడో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన మాక్సీ ధనాధన్ బ్యాటింగ్‌తో 28 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.
ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో పడిక్కల్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్ తొలి బంతి నుంచే బాదడం మొదలెట్టాడు. చక్రవర్తి వేసిన 15వ ఓవర్లో ఏబీడీ రెండు ఫోర్లు, మాక్సీ సిక్సర్ కొట్టడంతో 17 రన్స్ వచ్చాయి. వీరవిహారం చేస్తున్న మాక్స్‌వెల్‌ను 17వ ఓవర్లో కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు. రస్సెల్ వేసిన తర్వాతి ఓవర్లో ఏబీడీ 6 4 2 4 బాదడంతో 17 పరుగులొచ్చాయి. హర్భజన్ సింగ్ వేసిన 19వ ఓవర్లో 18 రన్స్ రాబట్టిన ఏబీడీ 27 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేసుకున్నాడు. రస్సెల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 4 6 2 4 4తో ఏబీడీ 21 పరుగులు సాధించడంతో బెంగళూరు స్కోరు 200 దాటింది.
5⃣0⃣ off 2⃣7⃣ balls! 🔥🔥
— IndianPremierLeague (@IPL) April 18, 2021
The ABD show is running in full swing! 👏👏#VIVOIPL #RCBvKKR
Follow the match 👉 https://t.co/sgj6gqp6tS pic.twitter.com/ODtZS2CA5O