Gukesh | సింగపూర్: భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా ఆటగాడు డింగ్ లిరెన్ మధ్య సింగపూర్ వేదికగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగుతోంది. శుక్రవారం ఈ ఇరువురి మధ్య జరిగిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో 14 గేమ్‌లు ఉన్న ఈ టోర్నీలో 4 గేమ్‌లు ముగిసేసరికి ఇరువురి ఖాతాలో తలా 2 పాయింట్లు చేరాయి.
తొలి మ్యాచ్‌లో మాదిరిగానే ఆరంభం నుంచే దూకుడుగా ఆడేందుకు లిరెన్ యత్నించాడు. ప్రారంభంలో అతడి పావుల కదలిక అలాగే సాగింది. కానీ గుకేశ్ ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా బదులివ్వడంతో అతడు వెనక్కి తగ్గాడు. ఆట మధ్యలోకి వచ్చేసరికి ఇరువురూ పలు తప్పిదాలు చేశారు. ఈ క్రమంలో జాగ్రత్త పడ్డ గుకేశ్, లిరెన్.. గేమ్ కోల్పోకుండా సేఫ్‌గా ఆడారు. 42 ఎత్తుల తర్వాత ఆట డ్రా గా ముగిసింది. శనివారం ఐదో గేమ్ జరుగనుంది.