64 గళ్ల ఆటలో కొత్త రారాజు వచ్చాడు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా భారత చదరంగ క్రీడకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వారసుడిగా తెలుగు మూలాలున్న 17 ఏండ్ల చెన్నై చిన్నోడు దొమ్మరాజు గుకేశ్ సంచలన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తనదైన ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. చెస్ బోర్డుపై పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలను మార్చుకుంటూ.. కెనడాలోని టొరంటో వేదికగా ముగిసిన ‘క్యాండిడేట్స్ చెస్ టోర్నీ- 2024’ టైటిల్ విజేతగా నిలిచి అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నవచరిత్ర లిఖించాడు. 14వ రౌండ్లో హికారు నకమురతో గేమ్‌ను డ్రా చేసుకోవడంతో 9 పాయింట్లు సాధించిన గుకేశ్.. అగ్రస్థానంలో నిలిచి ఆనంద్ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన రెండో భారతీయుడిగా రికార్డులకెక్కాడు. 2014లో ఆనంద్ ఈ టోర్నీ విజేతగా నిలవగా పదేండ్ల తర్వాత అతడే మెంటార్‌గా ఉన్న గుకేశ్.. టైటిల్ నెగ్గడం గమనార్హం.
Gukesh | టొరంటో : భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ సంచలన ప్రదర్శనతో ప్రతిష్టాత్మక ‘క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024’ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ విజేతను నిర్ణయించే 14వ రౌండ్లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అతడు 9 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానానికి చేరి 17 ఏండ్ల వయసులోనే ఈ టోర్నీ నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టోర్నీ ఆద్యంతం అంచనాలకు మించి రాణించిన గుకేశ్.. తుది రౌండ్లో నల్లపావులతో బరిలోకి దిగాడు. 71 ఎత్తులలో ముగిసిన ఈ గేమ్ తర్వాత టోర్నీ విజేతను నిర్ణయించే క్రమంలో కొంత నాటకీయత చోటుచేసుకుంది. 14వ రౌండ్లో ఫాబియానో కరువానా (అమెరికా) – ఇయాన్ నెపొనియాచి (రష్యా) ల మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచినా వారి పాయింట్లూ గుకేశ్‌తో సమానంగా (9) ఉండేవి. అప్పుడు విజేతను సంయుక్తంగా ప్రకటించాల్సి వచ్చేది. కానీ 41వ ఎత్తులో కరువానా తప్పిదం నెపొనియాచికి కలిసొచ్చి అతడు గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో నెపొనియాచి, కరువానా, నకముర 8.5 పాయింట్ల వద్దే ఆగిపోయి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. 8 మంది ఆటగాళ్లు ‘డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్’లో తలపడ్డ ఈ టోర్నీలో గుకేశ్.. ఏడో రౌండ్లో మాత్రమే ఓడిపోయాడు. కానీ ఆ రౌండ్లో ఓటమే తనలో కసి పెంచిందని విజేతగా నిలిచిన తర్వాత అతడు వెల్లడించాడు.
ఈ విజయంతో గుకేశ్.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతడు చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో తలపడాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కానప్పటికీ ఇక్కడా గెలిస్తే ప్రపంచ చాంపియన్‌గా నిలిచే అతి పిన్న వయస్కుడిగా అతడు రికార్డులకెక్కుతాడు.
‘గత కొన్ని రోజులుగా చాలా ఒత్తిడికి లోనయ్యా. కానీ నా ఆఖరి గేమ్ పూర్తికాకముందే చాలా ప్రశాంతంగా ఉంది. నేను గేమ్ ఆడుతున్నా నా దృష్టి అంతా ఆ గేమ్ (కరువానా-నెపొనియాచి) మీదే ఉంది. దేశం కోసం ఆడుతూ ఏదైనా సాధించడం చాలా చాలా ప్రత్యేకం. నా విజయానికి మద్దతుగా నిలిచినవారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఏడో రౌండ్లో ఓటమి తర్వాత విజయం నాలో కొత్త స్ఫూర్తిని నింపింది. ఓటమితో కాస్త నిరాశకు గురైనా తర్వాత మాత్రం పట్టుదలతో ఆడా. ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.
ఈ టోర్నీలో భాగంగా మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ చెస్ దిగ్గజం కోనేరు హంపి రెండో స్థానంలో నిలిచింది. 14వ రౌండ్లో ఆమె.. చైనా అమ్మాయి లి టింగ్జిని ఓడించింది. చైనాకే చెందిన టాన్ ఝోంగి 9 పాయింట్లతో విజేతగా నిలిచింది. హంపితో పాటు టింగ్జి, వైశాలి 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.