AUS vs PAK | ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న 18వ లీగ్ మ్యాచ్‌లో కంగారూలు దంచికొడుతున్నారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ పాకిస్తాన్ బౌలర్లను చితక్కొడుతున్నారు. పాకిస్తాన్ ప్రధాన పేసర్ హరీస్ రౌఫ్‌ను లక్ష్యంగా చేసుకున్న ఆసీస్ ఓపెనర్లు వీరవిహారం చేస్తున్నారు. 23 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆసీస్.. వికెట్లేమీ నష్టపోకుండా 169 పరుగులు చేసింది. వార్నర్ (75 బ్యాటింగ్, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తో పాటు మిచెల్ మార్ష్ (83 బ్యాటింగ్, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) లు చిన్నస్వామి స్టేడియంలో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు ఆది నుంచే ఘనమైన ఆరంభం దక్కింది. షహీన్ షా అఫ్రిది కాస్త ఫర్వాలేదనిపించినా హరీస్రౌఫ్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతడు వేసిన 8.1 వ ఓవర్ల వార్నర్.. 4, 6 బాదగా మిచెల్ మార్ష్ మూడు బౌండరీలు కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తంగా 24 పరుగులు పిండుకున్నారు. ఇక ఇఫ్తికర్ అహ్మద్ వేసిన మరుసటి ఓవర్లో వార్నర్ ఒక సిక్సర్ కొట్టగా మిచెల్ మార్ష్ కూడా రెండు ఫోర్లు కొట్టాడు.
ఉసామా మీర్ వేసిన 12వ ఓవర్లో మూడో బంతికి వార్నర్ బౌండరీ బాదడంతో ఆసీస్ వంద పరుగులు పూర్తయింది. వార్నర్ కూడా 39 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. రౌఫ్ వేసిన 13వ ఓవర్లో కూడా రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో కూడా రౌఫ్.. 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఉసామా మిర్ వేసిన 14వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన మార్ష్.. 46 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేశాడు. మార్ష్‌కు ఈ టోర్నీలో ఇది రెండో అర్థ సెంచరీ. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మార్ష్ అదే ఓవర్లో ఐదో బంతికి బారీ సిక్సర్ బాదాడు. వీరిరువురూ సెంచరీలకు చేరువవుతుండటంతో ఆసీస్ భారీ స్కోరుపై కన్నేసింది.