Chennai Super Kings : దక్షిణాఫ్రికా యువకెరటం డెవాల్డ్ బ్రెవిస్(Devald Brewis)కు అడిగినంతా ముట్టజెప్పారనే వార్తలపై ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్పందించింది. జూనియర్ డివిలియర్స్‌కు భారీగా ముట్టజెప్పారంటూ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) చేసిన వ్యాఖ్యలను సీఎస్కే యాజమాన్యం కొట్టిపారేసింది. రీప్లేస్మెంట్ ప్లేయర్ అయిన బ్రెవిస్‌ను నిబంధనలకు లోబడే తీసుకున్నామని వివరణ ఇచ్చింది. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ శనివారం సీఎస్కే ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది.
‘డెవాల్డ్ బ్రెవిస్‌ను రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా తీసుకునే సమయంలో అన్ని నియమాలను పాటించాం. ఐపీఎల్ నియమాల, నిబంధనలకు లోబడే బ్రెవిస్‌ను తీసుకున్నామని స్పష్టత ఇస్తున్నాం’ అని సీఎస్కే తమ పోస్ట్‌లో పేర్కొంది. ఐపీఎల్ ఆటగాళ్ల నియంత్రణ 2025-27 క్లాజ్6.6 ప్రకారం గాయపడిన క్రికెటర్‌కు ఎంత చెల్లించారో.. రీప్లేస్మెంట్ ప్లేయర్‌కు అంతే చెల్లించాలి. సీజన్ మధ్యలో ఎంట్రీ ఇచ్చే ఆటగాళ్లకు మాత్రం ధరలో కొంత తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. అతడు చేరే సమయానికి జట్టు ఎన్ని మ్యాచ్‌లు ఆడింది? అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
🚨OFFICIAL STATEMENT🚨
Dewald Brevis signed as per the IPL Player Regulations 2025-2027, clause 6.6 under Replacement Players.
— Chennai Super Kings (@ChennaiIPL) August 16, 2025
ఐపీఎల్ 18వ సీజన్ మధ్యలో సీఎస్కే బ్రెవిస్‌తో ఒప్పందం చేసుకుంది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన గుర్జన్‌ప్రీత్ సింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ సఫారీ ఆటగాడిని తీసుకుంది చెన్నై. ప్లేస్మెంట్ నిబంధనల ప్రకారం అతడికి రూ.2.2 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. తనపై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆరు మ్యాచుల్లో ఈ చిచ్చరపిడుగు 180 స్ట్రయిక్ రేటుతో విరుచుకుపడ్డాడు. రెండు హాఫ్ సెంచరీలతో 225 రన్స్ కొట్టి చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడీ హిట్టర్. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆస్ట్రేలియాపై మెరుపు శతకం బాదాడు బ్రెవిస్. ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో సిక్సర్లతో హోరెత్తించిన ఈ యంగ్‌స్టర్ తొలి శతకంతో మెరిశాడు. కంగారూ బౌలర్లను ఊచకోత కోసిన ఈ చిచ్చరపిడుగు అజేయంగా 125 రన్స్‌తో జట్టును గెలిపించాడు.
ఆసీస్‌పై సెంచరీతో చెలరేగిన బ్రెవిస్ గురించి అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అతడికి చెన్నై కనీస ధరకంటే ఎక్కువ ఇచ్చిందని చెప్పాడు. ‘బ్రెవిస్ గురించి మీకో విషయం చెప్పాలి. ఐపీఎల్లో సీఎస్కే తరఫున అతడు గొప్ప ప్రద్రర్శన చేశాడు. అయితే.. ఈ యంగ్‌స్టర్‌ను కొనేందుకు పలు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
🗣️ R Ashwin revealed CSK paid extra to secure Dewald Brevis after other teams backed out. (On his YouTube Channel) pic.twitter.com/l97W14o0XL
— CricketGully (@thecricketgully) August 14, 2025
కానీ, భారీ ధర ఇవ్వలేక కొందరు వెనక్కి తగ్గారు. ఏ ఆటగాడినైనా రీప్లేస్‌మెంట్‌గా తీసుకోవాల్సి వస్తే అతడికి కనీస ధర మాత్రమే చెల్లించాలి. కానీ, ఏజెంట్లు జోక్యం చేసుకోవడంతో ఆ ప్లేయర్ భారీగా డబ్బులు ఇస్తేనే ఆడుతానని చెప్పే అవకాశముంది. సీఎస్కేకు ఒకవేళ బ్రెవిస్‌ను వదిలేస్తే వేలంలో అతడు రికార్డు ధర పలుకుతాడు. అందుకే.. చెన్నై యాజమాన్యం బ్రెవిస్‌కు భారీగా ఆఫర్ చేసింది’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్లో వెల్లడించాడు.