రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. గ్రామీణ క్రీడా ప్రాంగణాలతో ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ.. ఇప్పుడు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లతో మరో సంచలనానికి తెరతీయబోతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు అత్యుత్తమ నాణ్యతతో సామాగ్రిని అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కొలువుదీరిన క్రీడా ప్రాంగణాలకు కొత్త కళ తీసుకొచ్చేలా స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయనుంది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెన్నుతట్టి ప్రోత్సహించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా క్రీడాశాఖ పక్కా ప్రణాళిను ఎంచుకున్నది. సీఎం కప్ ఇచ్చిన జోష్‌తో స్పోర్ట్స్ కిట్లను ప్లేయర్లకు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : క్రీడారంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిలా దూసుకుపోతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్లేయర్లు పతకాలు కొల్లగొడుతూ రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తున్నారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించేలా ప్లేయర్లను సానబెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పల్లెపగ్రతి, పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 17వేలకు పైగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని ప్రతిభను తట్టిలేపే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రతిభ కల్గిన గ్రామీణ ప్రాంత ప్లేయర్లకు సరైన వసతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నది. సీఎం కేసీఆర్ విజన్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 18,000 స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయబోతున్నది. గ్రామీణ ప్రాంతాలకు తోడు మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్లేయర్లకు నాణ్యమైన క్రీడా సామాగ్రిని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇందుకోసం ఇప్పటికే సాట్స్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిట్లు దాదాపు అన్ని చోట్లకు చేరుకున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
23 క్రీడా పరికరాలతో:
రాష్ట్ర ప్రభుత్వం ప్లేయర్లకు నాణ్యమైన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రభుత్వం మన్నికైన వస్తువులను అందించనుంది. మొత్తం 23 క్రీడా పరికరాలతో స్పోర్ట్స్ కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. కశ్మీర్ విల్లోతో కూడిన రెండు క్రికెట్ బ్యాట్లకు తోడు ప్యాడ్లు, గ్లౌజెస్, వికెట్‌కీపింగ్ గ్లౌజెస్, స్టంప్ట్స్, బంతులు, ప్యాడ్లను క్రికెట్ కిట్‌లో పొందుపరిచింది. దీనికి తోడు అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని నాలుగు వాలీబాల్ బంతులు, రెండు వాలీబాల్ నెట్స్, ఒక సైకిల్ పంప్, 30 కిలోల బరువుతో కూడిన మూడు వేర్వేరు డంబెల్స్, డిస్కస్‌త్రో(కేజీ, రెండు కేజీలు), ఆరు టెన్నికాయిట్ రింగ్స్, నాలుగు స్కిప్పింగ్ రోప్స్, మూడు ప్లాస్టిక్ విజిల్స్, ఒక స్టాప్ వాచ్ ఉన్నాయి.
ప్లేయర్లకు ప్రత్యేక టీషర్ట్లు:
కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లకు తోడు 75 మందికి టీషర్ట్లను అందించనున్నారు. సీఎం కేసీఆర్ చిత్రంతో రూపొందించిన లోగోతో టీషర్ట్లను డిజైన్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, క్రికెట్ ఆడే ప్లేయర్లకు వీటిని ఇవ్వనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో స్పోర్ట్స్ కిట్లతో పాటు టీషర్ట్లను పంపిణీ చేయనున్నారు.
మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా:
క్రీడా ప్రాంగణాలతో కొత్త విప్లవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం స్పోర్ట్స్ కిట్లతో దేశానికి మరోమారు ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం క్రీడాకారులకు కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వనరులను సద్వినియోగం చేసుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్లేయర్లను సానబెట్టేందుకు ఈ కిట్లు దోహదపడనున్నాయి.
నిరంతరం సమీక్షలు:
సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా స్పోర్ట్స్ కిట్లను అందరికీ చేరువ చేసేందుకు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్..నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.