హల్దానీ : ఉత్తరాఖండ్ వేదికగా 38వ నేషనల్ గేమ్స్‌కు శుక్రవారం తెరపడింది. గత కొన్ని రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తూ వస్తున్న నేషనల్ గేమ్స్ ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఆయా రాష్ర్టాలకు చెందిన పతక విజేతలతో పాటు కోచ్‌లు, అధికారులు, అభిమానులు పాల్గొన్నారు. నేషనల్ గేమ్స్‌లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్(ఎస్‌ఎస్‌సీబీ) చాంపియన్‌షిప్(68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు) కైవసం చేసుకోగా, మహారాష్ట్ర, హర్యానా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. కర్నాటకకు చెందిన స్విమ్మర్లు శ్రీహరి నటరాజ్, దినిది దెసింగ్ బెస్ట్ ప్లేయర్లుగా నిలిచారు. 3 స్వర్ణాలు, 3 రజతాలు,12 కాంస్యాలతో తెలంగాణ 26వ స్థానంలో నిలిచింది.