బార్బడోస్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్ (4/10) హ్యాట్రిక్‌తో విజృంభించడంతో పొట్టి ప్రపంచకప్‌లో యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈజీగా గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. జోర్డాన్‌తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అదిల్ రషీద్ (2/13), సామ్ కరన్ (2/23) విజృంభించడంతో మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 18.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్.
అనంతరం ఛేదనను ఇంగ్లీష్ జట్టు 9.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండానే ఛేదించింది. కెప్టెన్ జోస్ బట్లర్ (38 బంతుల్లో 83 నాటౌట్, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను ముగించాడు. హర్మీత్ వేసిన 9వ ఓవర్లో రెండో బంతికి సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తిచేసిన బట్లర్.. ఆ తర్వాత వరుస బంతుల్లో 6, 6, 6, 6 బాదాడు. ఈ విజయంతో గ్రూప్-బి లో ఇంగ్లండ్ 4 పాయింట్లతో దక్షిణాఫ్రికాతో సమంగా నిలిచినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో సెమీస్ చేరింది.. వెస్టిండీస్ -సౌతాఫ్రికా మధ్య సోమవారం జరిగే కీలక పోరులో భారీ తేడాతో గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.