హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): చర్లపల్లి సెంట్రల్ జైలు ఆవరణలో మూడు రోజులపాటు జరిగిన ఖైదీల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన నేరానికి ఏండ్లపాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని, శాంతియుత జీవనం అలవర్చుకుంటే కుటుంబం, సమాజంతో సంతోషంగా ఉండవచ్చని సూచించారు.
రాష్ట్రంలోని నాలుగు ప్లాటూన్స్ నుంచి 220 మంది ఖైదీలకు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, చెస్, క్యారమ్స్, పాటలు, డ్యాన్స్, 100, 800 మీటర్ల పరుగులో పోటీలు నిర్వహించారు. చర్లపల్లి సెంట్రల్ జైలు, చంచల్‌గూడ సెంట్రల్ జైలు, హైదరాబాద్, వరంగల్ పరిధిలోని ఖైదీలు పాల్గొన్న పోటీల్లో.. చర్లపల్లి సెంట్రల్ జైలు ఖైదీలు 6 బంగారు పతకాలు, 3 రజత పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఖైదీలు 4 బంగారు పతకాలు, 1 రజత పతకంతో రన్నరప్‌గా నిలిచారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా, ఐజీలు రాజేశ్, మురళి, డీఐజీలు సంపత్, శ్రీనివాస్, జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.