ఇస్లామాబాద్: మైనర్ బాలిక వేధింపు ఘటనలో పాకిస్థాన్ క్రికెటర్ యాసిర్ షాపై కేసు నమోదు అయ్యింది. క్రికెటర్ యాసిర్ షా స్నేహితుడు ఫర్హన్ తనను గన్పాయింట్లో బెదిరించి రేప్ చేశాడని, దాన్ని వీడియో తీసినట్లు కూడా ఆ బాలిక తన ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఈ ఘటన గురించి పోలీసులకు చెబితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యాసిర్ వార్నింగ్ ఇచ్చాడని ఆ అమ్మాయి తన ఫిర్యాదులో తెలిపింది. తాను పలుకుబడి కలిగిన వ్యక్తిని అని, తనకు పోలీసు ఆఫీసర్లు తెలుసు అని యాసిర్ షా బెదిరించినట్లు ఆ బాలిక చెప్పింది. యాసిర్, ఫర్హన్లు మైనర్లను రేప్ చేసి వీడియోలు తీస్తారని ఆ బాలిక ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఈ ఘటనకు చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నామని, నిజాలు తెలిసిన తర్వాత దానిపై కామెంట్ చేస్తామని పీసీబీ చెప్పింది.