అంచనాలకు అనుగుణంగా అదరగొడుతున్న అల్కరాజ్ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఈ స్పెయిన్ యువ సంచలనం ఏకపక్ష విజయం సాధించగా.. మూడోసీడ్ జొకోవిచ్ రికార్డు స్థాయిలో 17వ సారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌లో స్వితోలినా, ముచోవా ముందంజ వేశారు.
పారిస్: మట్టికోట టైటిల్ దక్కించుకునేందుకు మరో స్పెయిన్ ఆటగాడు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మరే ఆటగాడికి సాధ్యంకాని రీతిలో 14సార్లు విజేతగా నిలిచిన రఫేల్ నాదల్ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకోగా.. ఆ దేశానికే చెందిన కార్లోస్ అల్కరాజ్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. రౌండ్ రౌండ్‌కు పదునెక్కుతున్న అతడు ఆదివారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 6-3, 6-2, 6-2తో 17వ సీడ్ ముసెట్టిని మట్టికరిపించాడు. ప్రత్యర్థి బలం తెలుసుకునేంత వరకు మాత్రమే పాయింట్లు సమర్పించుకున్న అల్కరాజ్ కుదురుకున్నాక తన ప్రతాపం చూపాడు. రెండు గంటలకు పైగా సాగిన పోరులో అల్కరాజ్ 6 ఏస్‌లు సంధించగా.. ప్రత్యర్థి రెండింటికే పరిమితమయ్యాడు. అల్కరాజ్ 42 విన్నర్స్ కొట్టగా.. ముసెట్టి 17 విన్నర్స్ మాత్రమే బాదాడు. గంటకు 214 కిలోమీటర్ల స్పీడ్ సర్వీస్‌తో అదరగొట్టిన అల్కరాజ్ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. గతేడాది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకున్న అల్కరాజ్ రెండో మెగా టైటిల్ పట్టేందుకు మరో మూడడుగుల దూరంలో నిలిచాడు.
జొకో ఆడుతూ పాడుతూ..
సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ రికార్డు స్థాయిలో 17వ సారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో నాదల్ (22)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న జొకోవిచ్ ఈసారి ఆ సంఖ్య పెంచుకోవాలని తహతహలాడుతున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ జొకోవిచ్ 6-3, 6-2, 6-2తో ప్రపంచ 94వ ర్యాంకర్ పాబ్లో వరిల్లాస్పై ఆడుతూ పాడుతూ విజయం సాధించాడు. రొనాల్డ్ గారోస్‌లో ఇప్పటి వరకు రెండు సార్లు (2016, 2021) విజేతగా నిలిచిన జొకోవిచ్ నాలుగు గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్‌ను మూడేసి సార్లు చేజిక్కించుకున్న ఏకైక ప్లేయర్‌గా నిలిచేందుకు మరో మూడు విజయాల దూరంలో ఉన్నాడు.మరో మ్యాచ్‌లో కచనోవ్ 1-6, 6-4, 7-6 (9/7), 6-1తో సోంగోపై గెలిచి క్వార్టర్స్ చేరాడు.
క్వార్టర్స్‌లో ముచోవా
మహిళల విభాగంలో కరోలినా ముచోవా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సింగిల్స్ నాలుగో రౌండ్లో ముచోవా 6-4, 6-4తో అవెన్స్యాన్పై అలవోకగా గెలుపొందింది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ముచోవా వరుస సెట్లలో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో అనస్తసియా పాలిచెన్కోవా 3-6, 7-6 (7/3), 6-3తో మార్టినీస్పై పోరాడి విజయం సాధించింది. ఈ ఇద్దరు క్వార్టర్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. మరోవైపు స్టార్ ప్లేయర్ స్వితోలినా 6-4, 7-6 (7/5)తో కసాట్కినాపై గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.