ఢిల్లీ: భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్‌లో జరుగబోయే ప్రతిష్టాత్మక ‘క్యాండిడేట్స్ చెస్ టోర్నీ’కి అర్హత సాధించాడు. ‘ఫిడే సర్క్యూట్ 2025’లో అగ్రస్థానాన నిలవడంతో ఈ చెన్నై కుర్రాడికి అర్హత దక్కింది. ఈ ఏడాది మే నుంచి నిలకడగా రాణిస్తున్న ప్రజ్ఞానంద.. మాజీ చాంపియన్ డింగ్ లిరెన్‌ను అధిగమించి నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితమే స్వదేశంలో జరిగిన చెస్ ప్రపంచకప్‌లో నాలుగో రౌండ్‌కే నిరాశపరిచిన అతడు.. ఇటీవలే ముగిసిన లండన్ చెస్ క్లాసిక్ టైటిల్‌ను సంయుక్తంగా గెలుచుకోవడం కలిసొచ్చింది.
8 మంది తలపడబోయే ‘క్యాండిడేట్స్’లో ఇప్పటికే అనీష్ గిరి (నెదర్లాండ్స్), ఫాబియానో కరువానా (అమెరికా), మథియాస్ బ్లూబామ్ (జర్మనీ), జావోఖిర్ (ఉజ్బెకిస్థాన్), వీ యి (చైనా), ఆండ్రీ ఎసిపెంకో (ఫిన్లాండ్) అర్హత సాధించగా ఈ ఏడాది ఆగస్టు నుంచి 2026 జనవరి వరకు ఫిడే స్టాండర్డ్ రేటింగ్ లిస్ట్‌లో అత్యధిక ఆరునెలల సగటు రేటింగ్ ఉన్న ఆటగాడు ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. ఇక ఈ ఏడాది క్యాండిడేట్స్ టోర్నీలో భారత్ తరఫున పురుషుల విభాగంలో అర్హత సాధించిన ఒకే ఒక ప్లేయర్ ప్రజ్ఞానంద. మహిళల విభాగంలో యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి, ఆర్. వైశాలి క్వాలిఫై అయ్యారు.