హుయెల్వా (స్పెయిన్): డిఫెండింగ్ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధుతో పాటు భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. స్పెయిన్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21-14, 21-18తో పోర్న్‌పవీ చొచువాంగ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించగా.. పురుషుల సింగిల్స్‌లో 12వ సీడ్ శ్రీకాంత్ 21-10, 21-15తో గాంగ్ జూ లూ (చైనా)పై గెలుపొందాడు. 48 నిమిషాల్లో ముగిసిన మహిళల పోరులో సింధు ఆరంభం నుంచి ఆధిక్యం కొనసాగించింది. తొలి గేమ్ అలవోకగా నెగ్గిన సింధుకు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా కీలక సమయాల్లో పదునైన స్మాష్‌లతో రెచ్చిపోయిన తెలుగమ్మాయి చక్కటి విజయంతో ముందంజ వేసింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జూ యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. డబుల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీలు ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి వెనుదిరిగాయి.