ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికరపోరు జరుగుతున్నది. సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న టెస్టు సిరీస్ విజయం ఒడిసి పట్టుకోవాలని భారత్ చూస్తుంటే.. సొంతగడ్డపై తమ సత్తా ఏంటో చూపిస్తామని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉన్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మూడో టెస్టులో భారత్ 70 పరుగుల స్వల్ప లీడ్‌లో కొనసాగుతున్నది. ఓపెనర్లు రాహుల్, మయాంక్ విఫలం కాగా, కోహ్లీ, పుజార ఎదురొడ్డి నిలిచారు. యార్కర్ కింగ్ బుమ్రా పాంచ్పటాకాతో దక్షిణాఫ్రికా భరతం పట్టాడు. మార్క్మ్త్రో మొదలుపెట్టి సఫారీలకు చుక్కలు చూపించాడు.
కేప్‌టౌన్: న్యూలాండ్స్ పిచ్‌పై పేసర్లు నిప్పులు కురిపిస్తున్నారు. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై తమ ప్రతాపం చూపిస్తున్నారు. రబాడ (1/25), జాన్సెన్ (1/7) రాణింపుతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ (7), రాహుల్ (10) తీవ్రంగా నిరాశపరిచారు. 24 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (14 నాటౌట్), పుజార (9 నాటౌట్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. బుల్లెట్లా దూసుకొస్తున్న బంతులకు ఎదురొడ్డి నిలుస్తూ వికెట్లను కాపాడుకున్నారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి ప్రస్తుతం టీమ్ఇండియా 70 పరుగుల లీడ్‌లో కొనసాగుతున్నది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న టీమ్ఇండియా మూడో రోజు ఆటలో ఎన్ని పరుగులు సాధిస్తుంది అనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
బూమ్ బూమ్ బుమ్రా
టీమ్ఇండియా యువ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (5/42) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 17/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు బుమ్రా ధాటికి 210 పరుగులకు ఆలౌటయ్యారు. తన తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ మార్క్మ్ (8)ను సూపర్ బంతితో బోల్తా కొట్టించాడు. బుమ్రా స్వింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని మార్క్మ్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహారాజ్ (25), పీటర్సన్ (72) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు భారత బౌలింగ్ దాడిని కాచుకుంటూ ముందుకు నడిపించారు. అయితే డస్సెన్.. పీటర్సన్‌కు జతకలిశాడు. వీరిద్దరు టీమ్ఇండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. డస్సెన్‌ను ఉమేశ్ ఔట్ చేయగా, మూడు బంతుల వ్యవధిలో బవుమా (28), వెరియెన్(0) షమీ (2/39) ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆఖర్లో సఫారీ బ్యాటర్లు ప్రతిఘటించినా..బుమ్రా ముందు ఆటలు సాగలేదు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210 ఆలౌట్ (పీటర్సన్ 72, బుమ్రా 5/42), భారత్ రెండో ఇన్నింగ్స్: 57/2(కోహ్లీ 14నాటౌట్, పుజార 9 నాటౌట్)