Ajinkya Rahane | సుదీర్ఘమైన దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభానికి ముందు ముంబయి క్రికెట్ జట్టుతో పాటు అభిమానులకు షాక్ తగిలింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. జట్టు కొత్త నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇదే సమయం మంచి సమయమని పేర్కొన్నాడు. ముంబయి జట్టుకు నాయకత్వం వహించడం, టోర్నమెంట్ గెలువడం తనకు చాలా గౌరవమని పేర్కొన్నాడు. ఇప్పుడు కొత్త దేశవాళి సీజన్ ప్రారంభం కానుందని.. కొత్త బాధ్యతల కోసం.. కొత్త కెప్టెన్సీని సిద్ధం చేయడం అవసరమని తాను భావిస్తున్నానని.. ఈ మేరకు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను బ్యాట్స్‌మెన్‌గా పూర్తిగా కట్టుబడి ఉంటానని.. తాజా ట్రోఫీని గెలిచే లక్ష్యంతో మంబయి తరఫున ఆడటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.
రహానే కెప్టెన్సీలో ముంబయి దేశీయ క్రికెట్లో స్థిరత్వం సాధించడంతో పాటు విజేతగా నిలిచింది. రహానే నాయకత్వంలో ముంబయి 2023-24 సీజన్లో రంజీ ట్రోఫీని గెలిచింది. 2024-25లో ఇరానీ కప్, 2022-23లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలోనూ జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ విజయాలు రహానే కెప్టెన్సీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. 201 ఫస్ట్-క్లాస్ మ్యాచుల్లో 14వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన రహానే.. కెప్టెన్సీని వదులుకున్నా తాను మాత్రం రిటైర్డ్ కావడం లేదని స్పష్టం చేశాడు. అన్ని ఫార్మాట్లలో బ్యాట్స్‌మన్‌గా ఆడుతూనే ఉంటానని చెప్పుకొచ్చారు. బ్యాట్స్‌మన్ పాత్రలో పూర్తి ఉత్సాహంతో, నిబద్ధతతో ఆడుతానని రహానే చెప్పాడు.
ముంబయి జట్టులో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరందరికీ నాయతక్వ లక్షణాలు ఉన్నాయి. రహానే నిర్ణయంతో రాబోయే కాలంలో జట్టుకు కొత్తగా దిశా నిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు. కొత్తగా కెప్టెన్సీ రేసులో శ్రేయాస్ అయ్యర్ ముందున్నాడు. రహానే చివరిసారిగా ఐపీఎల్లో కోల్‌కతా తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో 13 మ్యాచ్‌ల్లో 390 పరుగులు చేశాడు. ముంబయి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయంతో.. రాబోయే సీజన్లో కేకేఆర్ అతన్ని కెప్టెన్‌గా కొనసాగిస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి కొత్త రంజీ సీజన్ మొదలు కానున్నది. ముంబయి జట్టు తన తొలి మ్యాచ్‌ను జమ్మూ కశ్మీర్‌తో ఆడనున్నది.
Rahane Post