ఢిల్లీ: ఇటీవలే టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమానానికి సంబంధించిన పంపకాల ప్రక్రియను బీసీసీఐ సిద్ధం చేసింది. ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లతో కలుపుకుని అమెరికా, వెస్టిండీస్‌కు వెళ్లిన 42 మందికీ వీటిని పంచనుంది. రూ.125 కోట్లను వరల్డ్ కప్ జట్టులో సభ్యులుగా ఉన్న 15 మంది ఆటగాళ్లకు తలా ఒక్కరికి రూ.5 కోట్లు అందించనుంది.
టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని చాహల్, జైస్వాల్‌కు కూడా ఇంతే క్యాష్‌ప్రైజ్ దక్కనుంది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రేకు ఒక్కొక్కరికి రూ. 2.55 కోట్లు దక్కనున్నాయి. అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలక్షన్ కమిటీలో ఉన్న సభ్యులు తలా కోటి రూపాయలు అందుకోనున్నారు.
ఫిజియోథెరపిస్టులు కమలేష్ జైన్, యోగేశ్ పర్మర్, తులసి రామ్, త్రోడౌన్ స్పెషలిస్టులు అయిన రాఘవేంద్ర, నువాన్, దయానంద్, మసాజర్లు రాజీవ్ కుమార్, అరుణ్ కనాడె, స్ట్రెంథ్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌కు తలా రూ. 2 కోట్లు అందనుంది. రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న గిల్, రింకూసింగ్, ఖలీల్కూ కోటి రూపాయలు ముట్టనున్నవి. వీళ్లే గాక జట్టుతో పాటే ఉన్న వీడియో అనలిస్టు, బీసీసీఐ సహాయక సిబ్బంది, లాజిస్టిక్స్ మేనేజర్‌కూ నగదు బహుమానం అందనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.