ఇండోర్: దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20టోర్నీలో రికార్డుల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే గుజరాత్ యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ రికార్డు సెంచరీలు మరువకముందే టోర్నీలో మరో ఫీట్ నమోదైంది. గురువారం సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 349/5 స్కోరు నమోదు చేసింది. ఓవరాల్‌గా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరుగా రికార్డుల్లోకెక్కింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో బరోడా 263 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది.
తొలుత భాను పునియా (51 బంతుల్లో 134 నాటౌట్, 5ఫోర్లు, 15సిక్స్‌లు) మెరుపు సెంచరీకి తోడు శివాలిక్శర్మ (55), రాజ్‌పుత్ (53), విష్ణు సోలంకి (50) అర్ధసెంచరీలతో విజృంభించారు. సిక్కిం బౌలర్లను ఊచకోత కోస్తూ పునియా బౌండరీల వరద పారించాడు. రోషన్‌కుమార్, తవాంగ్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సిక్కిం 20 ఓవర్లలో 86/7 స్కోరుకు పరిమితమైంది. రాబిన్ లింబో(20)టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నినాద్, మహేశ్ రెండేసి వికెట్లు తీశారు.
పంజాబ్ యువ బ్యాటర్ అభిషేక్‌శర్మ(29 బంతుల్లో 106 నాటౌట్, 8ఫోర్లు, 11సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 28 బంతుల్లోనే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మేఘాలయ బౌలర్లను ఉతికి ఆరేస్తూ అభిషేక్ కొట్టిన కొట్టుడుకు 143 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 9.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత మేఘాలయ 20 ఓవర్లలో 142/7 స్కోరుకు పరిమితమైంది. మరోవైపు మిజోరాంతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.