Babar Azam: బ్యాటింగ్‌కు అనుకూలించే పాకిస్తాన్ పిచ్‌లపై పరుగుల వరద కొనసాగించినా సారథిగా కీలక టోర్నీలలో విఫలమవుతుండటంతో కెప్టెన్సీ కోల్పోయిన పాక్ మాజీ సారథి బాబర్ ఆజమ్‌కు కష్టకాలం మరింత ఎక్కువవుతోంది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లలో దారుణ వైఫల్యాలతో సారథ్య పగ్గాలు చేజార్చుకున్న బాబర్.. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు. మూడు టెస్టులలోనూ బాబర్ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. బాబర్ వైఫల్యం అతడి టీ20 కెరీర్‌పైనా పడింది.
ఇన్నాళ్లూ పాకిస్తాన్ టీ20 టీమ్‌కు సారథిగానే గాక ఓపెనింగ్ బ్యాటర్‌గా ఉన్న బాబర్.. యువ ఓపెనర్ కోసం తన పొజిషన్‌ను కోల్పోయాడు. సిడ్నీ టెస్టులో అరంగేట్రం చేసిన సయీమ్ అయూబ్ కోసం బాబర్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఇకనుంచి సయీమ్ అయూబ్ పాక్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. ఇదే విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ ఇదివరకే బాబర్‌తో కూడా పంచుకున్నట్టు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అయూబ్ పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఆడుతుండటం ఇదే మొదటిసారి అయినా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మాత్రం అతడికి ఓపెనింగ్ కొత్తేం కాదు. పీఎస్ఎల్లో అతడు పెషావర్ జెల్మీ తరఫున ఆడుతూ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేవాడు. పాక్ జట్టులో ఫ్యూచర్ సయీద్ అన్వర్‌గా ప్రశంసలు అందుకుంటున్న అయూబ్.. బాబర్ స్థానాన్ని ఏ మేరకు భర్తీ చేయగులుగుతాడో చూడాలి. ఈనెల 12 నుంచి పాకిస్తాన్ – న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ మొదలవనుంది.
ఇప్పటివరకూ 104 టీ20లు ఆడిన బాబర్.. 98 ఇన్నింగ్స్‌లలో 3,485 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ముప్పై అర్థ శతకాలూ ఉన్నాయి. ఓపెనర్‌గా బాబర్.. 77 ఇన్నింగ్స్‌లలో 2,711 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా మూడు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. పాకిస్తాన్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2,612 పరుగులతో మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో నిలిచాడు.