షెంజెన్(చైనా): చైనా స్విమ్మింగ్ ఓపెన్లో ఆస్ట్రేలియా యువ స్విమ్మర్ కామెరాన్ మెక్ఎవాయ్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల 50మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో కామెరాన్ 20.88 సెకన్లలోనే పూర్తి చేశాడు. తద్వారా 17 ఏండ్లుగా బ్రెజిల్ స్విమ్మర్ సెజార్ సియోలో(20.91సె) పేరిట ఉన్న వరల్డ్ రికార్డును తాజాగా కామెరాన్ తుడిచిపెట్టాడు. అయితే 2009లో సూపర్ సూట్ ఎరాగా పేరొందిన సమయంలో సెజార్తో పాటు పలువురు స్విమ్మర్లు 150కి పైగా ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.
ఈ సూట్లకు నీటిపై తేలియాడే లక్షణంతో పాటు అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్న కారణంతో వీటిపై నిషేధం విధించారు. తన ప్రపంచ రికార్డుపై కామెరాన్ స్పందిస్తూ ‘పోటీకి ముందు నా వ్యక్తిగత ప్రదర్శన(21.06సె) అధిగమిస్తానన్న నమ్మకం నాకుంది. తొలుత 20.99 సెకన్లు అయినా చేరుకుంటా అనుకున్నా..కానీ 20.88 సెకన్లలో పూర్తి చేయడం నమ్మలేకపోతున్నా’ అని అన్నాడు. తన రికార్డును తిరుగరాసిన కామెరాన్ను సియోల్ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు.