బ్యాటింగ్‌లో రాణించినా పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్‌తో టీమ్ఇండియా మూల్యం చెల్లించుకుంది. దాదాపు ఇలాంటి వైఫల్యాలతోనే ఆసియాకప్‌లో ఫైనల్ చేరుకుండా వెనుదిరిగిన రోహిత్ సేన సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్‌లోనూ బోణీ కొట్టలేకపోయింది హార్దిక్ బాధ్యతాయుత బాదుడుకు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ మెరుపులు తోడవడంతో ఈ ఫార్మాట్లో కంగారూలపై అత్యధిక స్కోరు నమోదు చేసినా, చేజింగ్‌లో కామెరున్ గ్రీన్, మాథ్యూ వేడ్ ఆకాశమే హద్దుగా విరుచుకుపడటంతో భారత స్కోరు చిన్నబోయింది!
మొహాలీ: బౌలింగ్ వైఫల్యంతో మరోసారి టీమ్ఇండియా పరాజయం వైపు నిలిచింది. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరులో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలబడగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించాడు.
రాహుల్ ఆరంభంలో మెరిపిస్తే.. ఇన్నింగ్స్ చివరి మూడు బంతులను హ్యాట్రిక్ సిక్సర్లు బాది హార్దిక్ తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2), అక్షర్ పటేల్ (6), దినేశ్ కార్తీక్ (6) విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలీస్ 3, హజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. కామెరున్ గ్రీన్ (30 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌సెంచరీ నమోదు చేసుకోగా.. మాథ్యూ వేడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టాడు. భారత బౌలరల్లో అక్షర్ 3, ఉమేశ్ రెండు వికెట్లు పడగొట్టారు. గ్రీన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నాగ్‌పూర్‌లో రెండో టీ20 జరుగనుంది.
కొంపముంచిన క్యాచ్‌లు
మొదట బ్యాటింగ్‌లో సత్తాచాటి టీ20ల్లో ఆసీస్‌పై అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత్.. ఆనక బౌలింగ్‌లో పూర్తిగా నిరాశ పరిచింది. ఏమాత్రం పస లేని బౌలింగ్‌ను కంగారూలు ఆటాడుకున్నారు. దానికి తోడు పేలవ ఫీల్డింగ్ టీమ్ఇండియా కొంపముంచింది. కష్టతరమైన రిటర్న్ క్యాచ్‌లను ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్ అందుకోలేకపోగా.. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ సులభమైన క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఆసీస్ ఫీల్డింగ్ సమయంలో హర్షల్ లాంగాన్ మీదుగా కొట్టిన భారీ షాట్‌ను గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌండ్రీ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి అడ్డుకున్న తీరు వారెవ్వా అనిపించింది!
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 208/6 (పాండ్యా 71 నాటౌట్, రాహుల్ 55; ఎలీస్ 3/30, హజిల్‌వుడ్ 2/39), ఆస్ట్రేలియా: 19.2 ఓవర్లలో 211/6 (గ్రీన్ 61, వేడ్ 45 నాటౌట్; అక్షర్ 3/17, ఉమేశ్ 2/27).