యాషెస్ సిరీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. భారీ లక్ష్యఛేదనలో ఓటమిని తప్పించుకునేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది. ధనాధన్ ఆటతో విధ్వంసక వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న జోస్ బట్లర్.. రెండొందల పైచిలుకు బంతులాడినా ఇంగ్లిష్ జట్టును గట్టెక్కించలేకపోయాడు. జే రిచర్డ్సన్ ఐదు వికెట్లతో అల్లాడిస్తే.. మూడేండ్ల తర్వాత జట్టు పగ్గాలందుకున్న స్టీవ్ స్మిత్ మళ్లీ గెలుపు రుచిచూశాడు. డే అండ్ నైట్ టెస్టుల్లో ఆసీస్‌కు ఇది తొమ్మిదో విజయం కాగా.. స్వదేశంలో గులాబీ బంతితో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ కంగారూలు గెలువడం విశేషం!
అడిలైడ్: తొలి టెస్టులో ఘన విజయంతో యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సోమవారం ముగిసిన పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డే అండ్ నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 9వ విజయం కావడం విశేషం. 468 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 82/4తో సోమవారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 192 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (207 బంతుల్లో 26) తుదికంటా పోరాడగా.. అతడికి బెన్ స్టోక్స్ (77 బంతుల్లో 12), క్రిస్ వోక్స్ (97 బంతుల్లో 44) కాస్త సహకరించారు. ఐదో రోజు మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు ఇంగ్లిష్ బ్యాటర్లు ఎంత ప్రయత్నించినా.. ఆసీస్ పేసర్ జే రిచర్డ్సన్ ఐదు వికెట్లతో విజృంభించి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు సెంచరీ బాదిన మార్నస్ లబుషేన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడో (బాక్సింగ్ డే) టెస్టు ప్రారంభం కానుంది.
బట్లర్ టెస్టు ఇన్నింగ్స్
రెండో టెస్టు ఆసాంతం వెనుకబడిపోయిన ఇంగ్లండ్.. చివరి రోజు తమ పోరాటంతో ఆకట్టుకుంది. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని భావించిన ఇంగ్లండ్.. సోమవారం తొలి ఓవర్ నుంచే ‘డ్రా’ కోసం ప్రయత్నించింది. జో రూట్, డేవిడ్ మలన్, హమీద్, బర్న్స్ ఆదివారమే ఔట్ కాగా.. ఒలీ పోప్ (4) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఓవర్లు కరిగించే బాధ్యత భుజానెత్తుకున్నారు. పొట్టి క్రికెట్లో భారీ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి పరుగులు రాబట్టే బట్లర్ తన శైలికి పూర్తి భిన్నంగా అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పరుగులు చేయడం పక్కనపెట్టి కంగారూ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడమే పనిగా పెట్టుకున్న ఈ జోడీని చూస్తే ఇంగ్లండ్ గట్టెక్కేలా కనిపించినా.. 10 ఓవర్ల తర్వాత స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా లియాన్ ఈ జంటని విడదీశాడు. ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ నుంచి బట్లర్‌కు చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 190 బంతులు ఎదుర్కోవడం గమనార్హం. ప్రత్యర్థి పేసర్లు బౌన్సర్లతో పరీక్షిస్తున్నా.. సంయమనం కోల్పోని ఈ ద్వయం నిధానంగా మ్యాచ్‌ను ముందుకు నడిపింది. రిచర్డ్సన్ బౌలింగ్‌లో వోక్స్ ఔటైనా.. రాబిన్సన్ (39 బంతుల్లో 8), స్టువర్ట్ బ్రాడ్ (31 బంతుల్లో 9) మొండిగా పోరాడటంతో ఏ మూలో ఆశలు చెలరేగినా.. బట్లర్ అనూహ్యంగా హిట్ వికెట్ రూపంలో వెనుదిరగడంతో ఇంగ్లండ్ పరాజయం ఖాయమైంది. రెండు సెషన్ల పాటు ఆసీస్‌ను అడ్డుకున్న ఇంగ్లిష్ ఆటగాళ్లు.. ఆఖరి రోజు 21 ఓవర్ల ఆట మిగిలుండగా ఆలౌటయ్యారు. సుదీర్ఘ యాషెస్ చరిత్రలో తొలి రెండు టెస్టులు ఓడిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే.. డాన్ బ్రాడ్‌మన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా (1936-37) సిరీస్ చేజిక్కించుకోగలిగింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు నెగ్గిన ఆసీస్.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి నెగ్గినా సిరీస్ ఖాయమవనుంది.
మూడో టెస్టుకు కమిన్స్
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి భోజనం చేశాడనే కారణంతో రెండో టెస్టు ఆరంభానికి మూడు గంటల ముందు జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ గురువారం తిరిగి జట్టుతో చేరనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. దీంతో పాటు మిగిలిన మూడు టెస్టులకు ఇదే జట్టును కొనసాగించనున్నట్లు సోమవారం వెల్లడించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో నెగ్గిన కంగారూలు.. ఈ సారి 275 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించారు. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఓపెనర్ మార్కస్ హారిస్‌పై నమ్మకముంచిన బోర్డు.. పేస్ బౌలర్ హజిల్వుడ్కు ఫిట్నెస్ నిరూపించుకునే అవకాశం కల్పించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473/9 డిక్లేర్డ్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 230/9 డిక్లేర్డ్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్
(వోక్స్ 44, బర్న్స్ 34; జే రిచర్డ్సన్ 5/42).