మెల్బోర్న్: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆసీస్ సారథి పాట్ కమిన్స్, పేసర్ జోష్ హెజిల్వుడ్, మిచెల్ మార్ష్ వంటి కీలక ఆటగాళ్ల గాయాల బెడదకు తోడు గురువారం ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అభిమానులు ఉలిక్కిపడ్డారు. స్టోయినిస్ రిటైర్మెంట్ ప్రకటనతో ఆస్ట్రేలియా క్రికెట్లో ఏదో జరుగుతోందనీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయంగా వివిధ టీ20 లీగ్‌లలో ఆడుతున్న స్టోయినిస్.. ఇక నుంచి పూర్తిగా ఈ ఫార్మాట్‌పైనే దృష్టి సారించనున్నాడు. ఇక భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడ్డ హెజిల్వుడ్, కమిన్స్, మార్ష్ కూడా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారని ఆ జట్టు హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరమైన నేపథ్యంలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లలో ఒకరు ఆస్ట్రేలియాకు సారథిగా వ్యవహరించే అవకాశముంది.